లోక్‌సభ ఎన్నికలు అద్భుతం 64.1 కోట్ల మంది ఓటు వేశారు ఇది ప్రపంచ రికార్డు సీఈసీ రాజీవ్‌కుమార్‌

కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 31.2 కోట్ల మంది మహిళలు సహా మొత్తం 64.1 కోట్ల మంది ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా రికార్డు నెలకొల్పారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ చెప్పారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘

లోక్‌సభ ఎన్నికలు అద్భుతం 64.1 కోట్ల మంది ఓటు వేశారు ఇది ప్రపంచ రికార్డు సీఈసీ రాజీవ్‌కుమార్‌

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 31.2 కోట్ల మంది మహిళలు సహా మొత్తం 64.1 కోట్ల మంది ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా రికార్డు నెలకొల్పారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ చెప్పారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘ఇది మనందరికీ చరిత్రాత్మక సందర్భం. ఇది జీ7 దేశాల కంటే 1.5 రెట్లు అధికం. యూరోపియన్‌ యూనియన్‌లో ఉన్న దేశాల్లో ఓటర్ల కంటే 2.5 రెట్లు అధికం. ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు.

 

నిజానికి భారత ఎన్నికలు ఒక అద్భుతం. ప్రపంచంలో దీనికి సరిసాటి లేదు’ అని అన్నారు. ఎన్నికల సిబ్బంది అత్యంత జాగరూకతతో పనిచేయడం వల్ల 2019 ఎన్నికలతో పోల్చితే అతి తక్కువగా 39 పోలింగ్‌ కేంద్రాల్లోనే రీపోలింగ్‌ అవసరమైందని తెలిపారు. గత ఎన్నికల్లో 540 కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపినట్టు చెప్పారు. ఇప్పుడు రీపోలింగ్‌ నిర్వహించిన 39 కేంద్రాల్లోనూ 25 కేంద్రాలు రెండు రాష్ట్రాల్లోనివేనని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థపై నమ్మకం ఉంచిన జమ్ము కశ్మీర్‌ ఓటర్లు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అక్కడ గత నాలుగు దశాబ్దాల్లో లేనంత గరిష్ఠ స్థాయిలో ఓటింగ్‌ జరిగిందని చెప్పారు.

23 దేశాల నుంచి 75 మంది ప్రతినిధులు ఎన్నికలను పరిశీలించారని, ఎన్నికల నిర్వహణలో కమిషన్‌ కృషిని ప్రశంసించారని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. కండబలాన్ని, డబ్బు బలాన్ని, దుష్ప్రచారాలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తాము పకడ్బందీగా అదుపు చేయగలిగామని చెప్పుకొన్నారు.

అమిత్‌షాపై జైరాం రమేశ్‌ ఆరోపణలకు ఖండన

ఎన్నికలు ముగిసిన తర్వాత 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లకు హోం మంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారన్న కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపణలపై రాజీవ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వదంతులు వ్యాప్తి చేయడం, అనుమానాలు రేకెత్తించడం సరికాదని అన్నారు. దీనిపై ఇప్పటికే తగిన ఆధారాలు సమర్పించాలని జైరాం రమేశ్‌ను ఎన్నికల సంఘం కోరింది.