Viral News | ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్.. నెలకు లక్షల్లో జీతం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే అని అంతా ఫిక్సయిపోతారు.. ఎన్ని కష్టాలు ఎదురైనా అదే జాబ్‌లో కంటిన్యూ అవుతారు. కానీ ఓ పాతికేళ్ల కుర్రాడు మాత్రం.. లక్షల జీతం కంటే కూడా వర్క్‌లో ప్రశాంతత, సౌకర్యమే ముఖ్యమని భావించాడు. ఏడాదికి రూ.20 లక్షల వేతనం అందుకునే జాబ్‌ను తృణప్రాయంగా వదిలేశాడు. హర్యానాకు చెందిన యువకుడు చేసిన ఈ పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
హర్యానాలోని కైథల్‌కు చెందిన సౌరభ్ మిట్టల్ NIT కురుక్షేత్రలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే కేవలం 22 ఏళ్లకే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL)లో ఉద్యోగం సాధించాడు. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం.. లక్షల్లో జీతం ఇక లైఫ్ సెటిల్ అని అనుకున్నాడు. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రం అక్కడి పరిస్థితులు పూర్తి భిన్నంగా అనిపించాయి.
సౌరభ్‌ను పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ల్యూబ్స్ సేల్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు సిక్కిం, భూటాన్ ప్రాంతాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత కూడా సౌరభ్‌కే అప్పగించారు. అంతా బాగానే ఉంది.. కానీ ఆఫీసులో ఎన్విరాన్‌మెంట్, మౌళిక సదుపాయాలు ఏ మాత్రం బాగోలేవు. అతను పనిచేసే దగ్గర కనీసం తాగునీరు అందుబాటులో లేదు. టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ఆఫీసులో ఏసీ పనిచేయకపోతే పట్టించుకునే నాథుడు కూడా ఎవరూ లేరు. అతనే సొంత ఖర్చులతో దాన్ని రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది.
ముఖ్యంగా టాయిలెట్ సమస్యను సౌరభ్ తన మేనేజర్, హెచ్‌ఆర్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. హెచ్ఆర్‌ను అడిగితే అది బిజినెస్ అంశం.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకున్నారు. ఫైనాన్స్ విభాగాన్ని అడిగితే.. బడ్జెట్ లేదని టాయిలెట్‌ల మరమ్మతును తిరస్కరించింది. దీంతో చేసేదేమీ లేక ఆఫీసుకు దగ్గరలోనే తన రూమ్ ఉండటంతో రోజులో పలుమార్లు ఇంటికి వెళ్లి అవసరాలు తీర్చుకునే వాడిని అని సౌరభ్ చెప్పాడు. తాను రాజీనామా చేసిన సమయానికి కూడా ఆ సమస్య అలాగే ఉండిపోయిందని వాపోయాడు.
కేవలం మౌలిక సదుపాయాలే కాదని.. తన ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా తీవ్రంగానే ఉందని సౌరభ్ వెల్లడించారు. తన జాబ్‌లో సెలవులు తీసుకోవడం దాదాపు అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కాల్స్ వస్తూనే ఉంటాయని.. రోజూ అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేదని తెలిపాడు. ఆదివారం కూడా సెలవు ఉండదని.. ఆ రోజు కూడా పనిచేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఇదే కాకుండా తన ఉద్యోగానికి సంబంధం లేని పనులు కూడా చేయించే వాళ్లని చెప్పాడు. మేనేజర్‌ను ఎయిర్‌పోర్టు నుంచి తీసుకురావడం, హోటళ్లు బుక్ చేయడం వంటి వ్యక్తిగత పనులు కూడా తనపైనే మోపేవారని అన్నాడు.
ఇన్ని చేసినా సేల్స్ టార్గెట్ రీచ్ కాకపోతే ప్రెజర్ పెట్టేవాళ్లని.. వీడియో కాన్ఫరెన్స్‌లోనే తనపై అరవడం, తిట్టడం కామన్ అయిపోయిందని అన్నాడు. జీవితాంతం ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయలేనని అర్థమైందన్నాడు. అలా రెండేళ్లకే ఈ ఉద్యోగాన్ని కొనసాగించడం తన వల్ల కాదని నిర్ణయించుకున్నానని వివరించాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయానికి తన తండ్రి అంగీకరించలేదని చెప్పాడు. కుటుంబంలో పరువు పోతుందని ఆయన ఫీలైనట్లుగా చెప్పాడు. కానీ తన పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ల అమ్మ అండగా ఉందని చెప్పాడు. ఏదేమైనా.. ప్రభుత్వ రంగ ఉద్యోగం.. లక్షల్లో జీతం ఉన్నప్పటికీ ఏవేవో సాకులు చెప్పి ఉద్యోగం వదిలేసుకోవడంతో సౌరభ్ కథ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read More:
ఏడాదికి రూ.1.6 కోట్ల జీతం..తిరస్కరించి తల్లిదండ్రుల సేవలో!
చీర నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. షాక్‌లో వరుడు!
