NCP | అజిత్ ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ.. పార్టీకి నలుగురు కీలక నేతల రాజీనామా
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న మహారాష్ట్రలో అధికార భాగస్వామ్య పక్షం ఎన్సీపీ (అజిత్)కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నలుగురు కీలక నాయకులు మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీ (శరద్‌పవార్) అధినేత శరద్‌పవార్‌ను కలవడం రాజకీయంగా సంచలనం రేపింది

ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న మహారాష్ట్రలో అధికార భాగస్వామ్య పక్షం ఎన్సీపీ (అజిత్)కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నలుగురు కీలక నాయకులు మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీ (శరద్‌పవార్) అధినేత శరద్‌పవార్‌ను కలవడం రాజకీయంగా సంచలనం రేపింది. అజిత్‌పవార్ భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్రపవార్ పుణెలోని మోదీబాగ్ ఏరియాలో పర్యటించిన రోజే పింప్రి చించ్వాడ్ యూనిట్‌కు చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. ఇదే ప్రాంతంలో ఎన్సీపీ (శరద్‌పవార్) అధినేత ఇల్లు ఉన్నది.
ఎన్సీపీ పింప్రి చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవ్హానే తన రాజీనామా లేఖను మంగళవారం అజిత్‌పవార్‌కు పంపించారు. తాను ఎన్సీపీకి రాజీనామా చేసినట్టు అనంతరం ఆయన మీడియాకు ధృవీకరించారు. ‘నేను ఎన్సీపీ నుంచి తప్పుకొన్నాను. నా రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించాను’ అని అజిత్ గవ్హానే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. పింప్రి చించ్వాడ్‌కు చెందిన విద్యార్థి విభాగం చీఫ్ యశ్ సానే, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోంస్లే, పంకజ్ భాలేకర్ కూడా పార్టీకి రాజీనామా చేసినవారిలో ఉన్నారు.
వారంతా శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతారని తెలుస్తున్నది. తనకు మద్దతు ఇస్తున్న పలువురు ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కూడా త్వరలో పార్టీకి రాజీనామా చేస్తారని గవ్హానే వెల్లడించారు. అయితే.. అజిత్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ఇదిలా ఉంటే.. సునేత్ర పవార్ మంగళవారం శరద్‌పవార్ నివాసం ఉన్న మోదీబాగ్‌లో పర్యటించారు. అయితే.. ఆమె శరద్‌పవార్‌ను కలిశారా? లేదా? అనే అంశంలో ఎవరూ స్పష్టతనివ్వలేదు.
లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పార్టీకి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. రాయిగడ్ ప్రాంతంలో శరద్‌పవార్ పార్టీ ఎనిమిది సీట్లు దక్కించుకుంటే.. అజిత్ పార్టీకి ఒకే ఒక్క సీటు లభించింది. అజిత్‌పవార్ పక్షంలోని సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ సోమవారం ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే. పవార్ కుటుంబంలో అత్యంత సీనియర్.. శరద్‌పవార్. ఒకవేళ ఆమె శరద్‌పవార్‌ను కలిసి ఉంటే ఆమె మంచి పని చేసినట్టు’ అని ఛగన్ భుజ్‌బల్ అన్నారు.