లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన 543లో 504 మంది కోటీశ్వ‌రులే.. టాప్ త్రీలో ఇద్ద‌రు తెలుగు రాష్ట్రాల వారే..!

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఘ‌ట్టం ముగిసింది. ఇక 18వ లోక్‌స‌భ కొలువుదీర‌డ‌మే మిగిలింది. ఈ ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ‌కు ఎన్నికైన 543 మందిలో 504 మంది అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులే..

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన 543లో 504 మంది కోటీశ్వ‌రులే.. టాప్ త్రీలో ఇద్ద‌రు తెలుగు రాష్ట్రాల వారే..!

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఘ‌ట్టం ముగిసింది. ఇక 18వ లోక్‌స‌భ కొలువుదీర‌డ‌మే మిగిలింది. ఈ ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ‌కు ఎన్నికైన 543 మందిలో 504 మంది అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులు ఉన్న‌ట్లు అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్‌(ఏడీఆర్) తేల్చింది. అంటే 93 శాతం మంది అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులు. 2019 ఎన్నిక‌ల్లో 88 శాతం మంది కోటీశ్వ‌ర్లు ఉండ‌గా, ఇప్పుడు ఆ సంఖ్య మ‌రో ఐదు శాతానికి పెరిగింది. 2019లో 475, 2014లో 443 మంది, 2009లో 315 మంది కోటీశ్వ‌ర్లు ఉన్నారు. 2024 ఎన్నిక‌ల్లో 504 మంది కోటీశ్వ‌ర్లు ఉన్నారు. అంటే ఏడాదికేడాది లోక్‌స‌భ‌లో కోటీశ్వ‌రుల సంఖ్య అమాంతం పెరుగుతూ పోతోంది.

ఈ 504 మంది అభ్య‌ర్థుల్లో టాప్ త్రీలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు అభ్య‌ర్థులు ఉన్నారు. మూడో స్థానంలో హ‌ర్యానాకు చెందిన అభ్య‌ర్థి ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన టీడీపీ అభ్య‌ర్థి చంద్ర‌శేఖ‌ర్ పెమ్మ‌సాని రూ. 5,705 కోట్ల‌తో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నారు. తెలంగాణ‌లోని చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి రూ. 4,568 కోట్ల‌తో రెండో స్థానంలో నిలిచారు. హ‌ర్యానాలోని కురుక్షేత్ర నుంచి గెలుపొందిన న‌వీన్ జిందాల్ రూ. 1,241 కోట్ల‌తో తృతీయ స్థానంలో ఉన్నారు. న‌వీన్ జిందాల్ బీజేపీ టికెట్‌పై గెలుపొందారు.

504 మంది కోటీశ్వ‌రుల్లో.. బీజేపీ నుంచి 240 మంది గెల‌వ‌గా ఇందులో 227 మంది కోటీశ్వ‌ర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది గెల‌వ‌గా 92 మంది, డీఎంకే నుంచి 22 మంది గెలుపొంద‌గా 21 మంది, తృణ‌మూల్ కాంగ్రెస్ 29 మంది విజ‌యం సాధించ‌గా 27 మంది, స‌మాజ్‌వాదీ పార్టీ నుంచి 37 మంది గెల‌వ‌గా 34 మంది కోటీశ్వ‌ర్లు ఉన్నారు. వీరంతా రూ. కోటికి పైగానే ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు త‌మ ఎన్నిక‌ల అఫిడ‌విట్ల‌లో పేర్కొన్నారు. ఇక టీడీపీ నుంచి గెలుపొందిన 16 మంది, జేడీయూ నుంచి 12, ఆప్ నుంచి గెలుపొందిన ముగ్గురు అభ్య‌ర్థులు కూడా కోటీశ్వ‌రులే.