Maoists | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో గ‌ర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టులు హ‌తం

Maoists | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో తుపాకులు గ‌ర్జించడంతో తూటాల వ‌ర్షం కురిసింది. ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఐటీబీపీ పోలీసులు ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ్‌పూర్ జిల్లాలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది.

Maoists | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో గ‌ర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టులు హ‌తం

Maoists | రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో తుపాకులు గ‌ర్జించడంతో తూటాల వ‌ర్షం కురిసింది. ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఐటీబీపీ పోలీసులు ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ్‌పూర్ జిల్లాలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది.

నారాయ‌ణ్‌పూర్ జిల్లాలోని తుల్తుల్లి, గోబెల్ గ్రామాల స‌మీపంలో ఉన్న అడ‌వుల్లో మావోయిస్టులు సంచ‌రిస్తున్న‌ట్లు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల‌తో క‌లిసి ఐటీబీపీ బ‌ల‌గాలు అక్క‌డ యాంటీ మావోయిస్టు ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో బ‌ల‌గాల‌కు మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు.

దీంతో మావోయిస్టుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి మావోయిస్టుల మృత‌దేహాల‌తో పాటు ఆయుధాలు, ఇత‌ర వ‌స్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో 125 మంది మావోయిస్టుల‌ను పోలీసులు మ‌ట్టుబెట్టారు. మే 23వ తేదీన నారాయ‌ణ్‌పూర్ – బీజాపూర్ స‌రిహ‌ద్దుల్లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, మే 10న బీజాపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టుల‌ను హ‌తం చేశారు.

ఏప్రిల్ 30న నారాయ‌ణ్‌పూర్ – కాంకేర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చ‌నిపోయారు. ఇందులో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టుల‌ను చంపేశారు.