పాయువులో కిలో బంగారం.. పట్టుబడ్డ ఎయిర్ హోస్టెస్
ఓ ఎయిర్ హోస్టెస్ పాయువులో కిలో బంగారం దాచుకుని పట్టుబడింది. కేరళలోని కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను డీఆర్ఐ అదుపులోకి తీసుకున్నారు.

తిరువనంతపురం : ఓ ఎయిర్ హోస్టెస్ పాయువులో కిలో బంగారం దాచుకుని పట్టుబడింది. కేరళలోని కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను డీఆర్ఐ అదుపులోకి తీసుకున్నారు.
మస్కట్ నుంచి కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు మే 28వ తేదీన ఓ విమానం వచ్చింది. ఆ విమానానికి సంబంధించిన ఎయిర్ హోస్టెస్ తన పాయువులో 960 గ్రాముల బంగారాన్ని దాచుకుంది. ఎయిర్ హోస్టెస్ బంగారం తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కన్నూరు ఎయిర్‌పోర్టులో ఆమెను తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరిచి, 14 రోజుల రిమాండ్ విధించారు. కన్నూరులోని మహిళా జైలుకు ఆమెను తరలించారు. నిందితురాలిని కోల్‌కతాకు చెందిన సురభి ఖతూన్‌గా అధికారులు గుర్తించారు.
అయితే ఒక ఎయిర్ హోస్టెస్ పాయువులో బంగారం దాచి తరలించడం ఇదే మొదటి కేసు అని పోలీసులు పేర్కొన్నారు. సురభి గతంలోనూ బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేరళకు చెందిన కొంత మందితో కలిసి ఈ స్మగ్లింగ్‌కు తెరలేపినట్లు పేర్కొన్నారు.