• Telugu News
  • /National

Srinagar Tulip Garden : శ్రీనగర్‌ తులిప్‌ గార్డెన్ ప్రారంభం..సందర్శకుల వెల్లువ

శ్రీనగర్‌లో ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ తెరుచుకుంది. 18 లక్షల తులిప్ పూల అందాలకు సందర్శకుల వెల్లువ కొనసాగుతోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 17, 2026, 2:48 pm IST
Read Time: 5 mins
Srinagar Tulip Garden : శ్రీనగర్‌ తులిప్‌ గార్డెన్ ప్రారంభం..సందర్శకుల వెల్లువ

విధాత : జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని ఆసియాలోనే అతిపెద్ద తులిప్‌ గార్డెన్ సందర్శకుల కోసం తెరుచుకుంది. జబర్వాన్ పర్వత శ్రేణులు, లోయాల మధ్య, ప్రపంచ ప్రసిద్ద దాల్ సరస్సు తీరాన కొలువుదీరిన ఈ తోటలో 75కి పైగా రకాలకు చెందిన 18 లక్షల తులిప్‌ పువ్వులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటు మరో లక్ష రకాల ఇతర పుష్పాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. లోయలో వసంత రుతువు ప్రారంభ ప్రతీకగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తులిప్ గార్డెన్‌ను ప్రారంభించారు.

ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు, నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రంగుల పూదోటలో ఒమర్ తన కేబినెట్ సహచరులతో సెల్ఫీలు దిగారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తులిప్ గార్డెన్ అందాలను వీక్షించేందుకు తరలివచ్చారు. కాశ్మీర్‌ను సందర్శించే పర్యాటకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని, వికసిస్తున్న తులిప్ పువ్వుల అద్భుతమైన అందం, ప్రకాశవంతమైన రంగులు, ఆహ్లాదకరమైన సువాసన సందర్శకులకు ఒక ప్రత్యేకమైన, మరపురాని అనుభూతిని అందిస్తాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.

సందర్శకుల వెల్లువ

భూతల స్వర్గంగా కనిపించే కాశ్మీర్ లోయలో మంచుతో కప్పబడిన పర్వతాలు, తళతళలాడే సరస్సుల చెంతన రంగుల హరివిల్లుల వరుసలను తలపించే ఎరుపు, పసుపు, గులాబీ, ఊదా, తెలుపు ఇంకా మరెన్నో రంగులతో నిండిన తులిప్ పూదోట సందర్శకులకు స్వర్గలోక సందర్శన అనుభూతిని అందిస్తుంది. ప్రకృతి దిద్దిన రంగుల కాన్వాయ్..పూల ఇంద్రధనస్సు తులిప్ పూదోట అందాలకు సందర్శకులు ముగ్దులై పరవశిస్తున్నారు. సెల్ఫీలు, ఫోటోలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 18 లక్షల తులిప్ మొక్కలతో పాటు, ఒక లక్ష ఇతర రకాల (డాఫోడిల్స్, హయాసింత్స్) పూలు నాటడం విశేషం. సాధారణంగా మార్చి చివరలో తెరిచే ఈ గార్డెన్, ఈ ఏడాది వాతావరణం వేడిగా ఉండటంతో 10 రోజుల ముందే తెరవడం విశేషం.

ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత, గత సంవత్సరం తాత్కాలికంగా మూసివేసిన 44 పర్యాటక ప్రదేశాలలో తులిప్ గార్డెన్ కూడా ఒకటి. సందర్శకుల భద్రతకు అన్ని చర్యలు చేపట్టిన పిదప..అధికారులు ఈ సంవత్సరం తులిప్ ఉద్యానవనాన్ని తిరిగి తెరిచారు.

ఇవి కూడా చదవండి :

అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు
Nanda Devi Ship : నందా దేవి గ్యాస్ మోసుకొచ్చింది…ఎల్పీజీ కష్టాలకు చెక్ !