కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. డీఏను 2 శాతం పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (డీఏ) 2 శాతం పెంచడానికి నిర్ణయం తీసుకుంది . దీనికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏను సవరిస్తుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ భత్యాన్ని అందజేస్తారు. ఏటా జనవరి, జులైలో ఈ సవరింపు ఉంటుంది. అయితే ఈసారి డీఏ పెంపు ప్రకటన ఆలస్యమైంది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం డీఏ పెంచింది. అలాగే ఈ క్యాబినెట్‌ సమావేశంలో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. దీనికోసం రూ. 12, 980 కోట్ల నిధులతో ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికింద భారత జెండా నౌకలు, భారత్‌ నుంచి రాకపోకలు సాగించే నౌకలకు బీమా కవరేజీ అందించడమే లక్ష్యం. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో హర్మూజ్‌ జలసంధిలో రవాణా నౌకలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిధిని ఏర్పాటుచేయడం గమనార్హం. గ్రామీణ సడక్ యోజన పథకాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించింది.

కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు, విస్తరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గాజియాబాద్‌-సీతాపూర్‌ మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. రాజమండ్రి-విశాఖ మధ్య మొత్తం 198 కి.మీ మేర రూ.9,889 కోట్లతో మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిడదవోలు-దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉన్న చెన్నై-హౌడా మధ్య ఈ సెక్షన్‌లో నాలుగు లైన్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ఏపీలోని తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలను కవర్‌ చేస్తారు. తూర్పు తీరంలోని విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు మార్గం తూర్పు తీరంలోని అత్యంత రద్దీగా ఉండే, సరకు రవాణా అధికంగా జరిగే మార్గాల్లో ఒకటిగా ఉందని కేంద్రం వెల్లడించింది. ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కి.మీ రైలు వంతెన, 2.67కి.మీ వయాడక్ట్‌, 3 బైపాస్‌ల నిర్మాణం జరగనుంది.

ఇవి కూడా చదవండి :

హర్మూజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్‌
దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది : వైఎస్. షర్మిల