న్యూఢిల్లీ : వాణిజ్య గ్యాస్ సరఫరాకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖ రాశారు.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల కమర్షియల్ గ్యాస్ కోటాను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పశ్చిమాసియా నుంచి గ్యాస్ సరఫరా మెరుగవుతుండటంతో క్రమంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా కోటాను కేంద్రం పెంచుతూ వస్తోంది. గతవారం కమర్షియల్ గ్యాస్ కోటా 50 శాతం వరకు పెంచిన కేంద్రం.. తాజాగా మరో 20 శాతం పెంచింది.
ఒక్కొక్కటిగా భారత్ కు వస్తున్న గ్యాస్, చమురు నౌకలు
హర్మూజ్ జలసంధి మార్గం నుంచి భారత్ గ్యాస్, చమురు నౌకలు ఒక్కొక్కటిగా దేశానికి చేరుకుంటున్నాయి. 22 నౌకలకు తాజాగా ఇరాన్ అనుమతినివ్వడంతో క్రమంగా భారత్ తీరానికి చేరుతున్నాయి. 24 వేల మెట్రిక్ టన్నులు (టీఎంటీ) ఎల్‌పీజీ గ్యాస్‌తో ‘బీడబ్ల్యూ బ్రిచ్’ అనే భారీ నౌక విశాఖ తీరానికి చేరింది. నెదర్లాండ్స్‌లో లోడింగ్ చేసుకున్న హెల్లాస్ గ్లాడియేటర్, అమెరికా పోర్టులో లోడింగ్ చేసుకున్న జుపిటర్ నౌకలు ఈ నెల 30న విశాఖ చేరుకోనున్నాయి. ఇప్పటికే లుపినస్ (22 టీఎంటీ), ఏఐ వుకిర్ (26 టీఎంటీ) నౌకలు యూఏఈ, ఖతార్ నుంచి గత నెల 26, ఈ నెల 3న విశాఖ చేరుకున్నాయి. అలాగే చమురు నౌకలు ఎంవీ సమర్ శృతి విశాఖ పోర్టులో యాంకరేజీలో లంగర్ వేసింది. ఎంవీ స్వర్ణ సింధు అనే క్రూడ్ ఆయిల్ నౌక హెచ్‌పీసీఎల్ కోసం మరో రెండు రోజుల్లో చేరుకోనుంది. న్యూ మంగళూరు పోర్టుకు 40 వేల టన్నుల ఎల్‌పీజీతో ‘అపోలో ఓషియన్’ నౌక చేరింది. ఈ నెల 1 నుంచి ఇరాక్, రష్యా, ఖతార్, యూఏఈల నుంచి చమురు నౌకలు భారత్ లోని వివిధ పోర్టులకు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి :
వైభవంగా అయోధ్య, భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు
Ram Charan | చరణ్ గొప్పతనంపై జానీ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ .. 2వేల మందికి ఇన్సూరెన్స్ చేయించారు..
