Cloudburst | హిమాచల్‌పై క్లౌడ్‌బరస్ట్.. 40 మంది గల్లంతు
హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ ఘటనల్లో నలుగురు చనిపోగా, 40 మంది గల్లంతయ్యారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి

2 జల విద్యుత్తు కేంద్రాలకు భారీ నష్టం
రోడ్లు తెగిపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ ఘటనల్లో నలుగురు చనిపోగా, 40 మంది గల్లంతయ్యారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు జల విద్యుత్తు ప్రాజెక్టులు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ సుమారు 35 మందిని వివిధ ప్రాంతాల్లో రక్షించినట్టు పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ దళాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని చెప్పారు. రాంపూర్, పధార్ తదితర ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు అనేక ప్రాంతాల్లో తెగిపోయాయి. దీంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నది. నాలుగు మోటరబుల్ వంతెనలు, ఫుట్‌బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. సహాయ చర్యలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తెరాంగ్, రాజ్‌బన్ గ్రామాలపై కుంభవృష్టి కురిసినట్టు తలతుఖోద్ పంచాయత్ ప్రధాన్ కాళీరామ్ తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో అనేక మంది గల్లంతయ్యారని ఆయన చెప్పారు. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయని తెలిపారు. రోడ్లు పెద్ద ఎత్తున ధ్వంసం కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఇతర క్షేత్రస్థాయి బృందాలు కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవాల్సి వచ్చింది.
కులు జిల్లాలోని మలానా నల్లా ప్రాంతంలో కురిసిన కుంభవృష్టితో మలనా 1, మలనా 2 జల విద్యుత్తు ప్రాజెక్టులు భారీగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో పార్వతి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. జియా, భుంతర్ సహా నదీతీరంలోని అన్ని ప్రాంతాల ప్రజలను తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు కోరారు. మండి జిల్లా అధికారులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయాన్ని కోరారు. మండిలోని పధార్‌లో అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బియాస్ నది పొంగి ప్రవహిస్తున్నది. దీంతో చండీగఢ్, మనాలి జాతీయ రహదారి అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్నది. కులులోని భాగిపూల్‌లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పార్వతి నదితోపాటు మలానా ఖుద్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.