Rajeev Shukla | పాక్‌ను రెండు ముక్కలు చేసిన ఘనత మాది: రాజీవ్‌ శుక్లా

నరేంద్రమోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామన్న యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌పై కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా బుధవారం నిప్పులు చెరిగారు.

Rajeev Shukla | పాక్‌ను రెండు ముక్కలు చేసిన ఘనత మాది: రాజీవ్‌ శుక్లా

పదేళ్లలో పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?
బీజేపీకి కాంగ్రెస్‌ నేత కౌంటర్‌

లక్నో: నరేంద్రమోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామన్న యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌పై కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా బుధవారం నిప్పులు చెరిగారు. పదేళ్లుగా పార్లమెంటులో పూర్తి మెజార్టీ ఉన్నా.. ఆ పని చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘ఆదిత్యనాథ్‌ రక్షణ మంత్రీ కాదు.. విదేశాంగ మంత్రీ కాదు. ఈ పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం పీవోకేను స్వాధీనం చేసుకొని ఉండాల్సింది.

కానీ.. మెజార్టీ ఉండి కూడా ఆ పని చేయలేదు’ అని శుక్లా అన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1971లో పాకిస్థాన్‌పై యుద్ధం చేసి, బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ‘ఇందిరాగాంధీకి అధికారంలోకి వచ్చి, పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేశారు. అదీ కాంగ్రెస్‌ ఘనత’ అని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలు బీజేపీని వదిలేసి ఇండియా కూటమి పక్షాన నిలుస్తాయని శుక్లా చెప్పారు.

ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ఒక ఎన్నికల సభలో మాట్లాడిన యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌.. ‘పీవోకేను భారతదేశంలో అంతర్భాగం చేసేందుకే మేము 400 సీట్లు అడుగుతున్నాం’ అని చెప్పిన విషయం తెలిసిందే. ‘పీవోకే భారతదేశలోనే ఉన్నది. ఉంటుంది. పీవోకేను భారత్ స్వాధీనం చేసుకుంటుంది’ అని హోం మంత్రి అమిత్‌షా మంగళవారం వ్యాఖ్యానించారు.