ఢిల్లీ – డెహ్రాడూన్​ ఎక్స్‌ప్రెస్‌వే : ₹12 వేల కోట్ల మెగా ప్రాజెక్ట్​ – ఏంటి ప్రత్యేకతలు?

ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఢిల్లీ–డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను నేడు ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న 213 కిమీ రోడ్డు వల్ల 6 గంటల ప్రయాణం 2.5 గంటలకు తగ్గింది. 12 కి.మీల వైల్డ్‌లైఫ్ కారిడార్‌ అద్భుతంగా ఉంది.

Delhi Dehradun mega expressway wide road aerial view

దేశంలోనే అత్యాధునిక హైవేలలో ఒకటిగా నిలిచిన డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే

Delhi–Dehradun Expressway: Toll, Route Map, Wildlife Corridor Explained

ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు

  • 12 కి.మీ వైల్డ్‌లైఫ్ కారిడార్ – ఆసియాలోనే ప్రత్యేకం
  • టూరిజం, వ్యాపారాలకు భారీ ఊతం
  • 213 కి.మీ దూరం – రెండున్నర గంటల్లో చేరువ
  • అత్యాధునిక సాంకేతికతతో స్మార్ట్ పర్యవేక్షణ

 

విధాత భారత్​ డెస్క్​ | 14 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

Delhi–Dehradun Expressway: దేశ రహదారి మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయి చేరింది. దిల్లీ–డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. సుమారు 213 కిలోమీటర్ల పొడవైన ఈ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఇప్పటివరకు 6 నుంచి 6.5 గంటలు పట్టే ప్రయాణం ఇకపై కేవలం 2 నుంచి 2.5 గంటల్లోనే పూర్తవుతుంది. ఉత్తర భారతదేశ అనుసంధానాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ ప్రాజెక్టు, పర్యాటకం నుంచి వ్యాపారం వరకు విస్తృత ప్రభావాన్ని చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అక్షర్​ధామ్​లో మొదలై.. అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతుంది

రాత్రి వెలుగుల్లో పర్వతాల మధ్య సుందరంగా ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే

అక్షర్​ధామ్ ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే(Eastern Peripheral Expressway)తో కలుస్తూ బాగ్‌పట్​, బరౌత్​, ముజఫర్‌నగర్‌, షామ్లీ, సహారన్‌పూర్ జిల్లాల గుండా ప్రయాణించి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ను చేరుతుంది. హరిద్వార్‌ కోసం దీన్నుంచి విడిపోయే ప్రత్యేక హైవే, చార్‌ధామ్ హైవేతో కనెక్టివిటీ ఉండటంతో ముస్సోరీ, హిల్ స్టేషన్లు, పుణ్యక్షేత్రాలకు చేరుకోవడం మరింత సులభమవుతుంది. ప్రస్తుతం ఉన్న మార్గంతో పోలిస్తే దూరం కూడా తగ్గడంతో పాటు ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది.

కొండలపై ఎలివేటెడ్ మార్గంగా నిర్మించిన ఆధునిక ఎక్స్‌ప్రెస్‌వే

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.11,800 కోట్లకు పైగా వ్యయం కాగా, కొంత భాగం 12 లేన్లతో, మిగతా భాగం 6 లేన్లతో అభివృద్ధి చేశారు. మొత్తం మార్గంలో 100కి పైగా అండర్‌పాస్‌లు, పలు ఇంటర్‌చేంజ్‌లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు. లోకల్ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అదనంగా అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS) అమలు చేయడంతో వేగ నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్, అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.

టోల్, ట్రాఫిక్ సిస్టమ్‌తో స్మార్ట్ హైవే అనుభవం

కొండలను ఛేదించి నిర్మించిన టన్నెల్ మార్గం

ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో టోల్ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఆధారంగా టోల్ వసూలు చేయనుండగా, దిల్లీ నుంచి డెహ్రాడూన్ వరకు ఒకవైపు కారు ప్రయాణానికి సుమారు ₹670 నుంచి ₹675 వరకు ఖర్చు ఉండొచ్చని అంచనా. మొత్తం 4 నుంచి 5 టోల్ ప్లాజాలు ఈ మార్గంలో ఉన్నాయి. కొన్ని ప్రారంభ భాగాలు టోల్ ఫ్రీగా ఉండే అవకాశమూ ఉంది. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రియల్‌టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, వేగ నియంత్రణ, ప్రమాదాలపై వెంటనే స్పందించే సదుపాయం కల్పించారు. దీంతో ప్రయాణం వేగంగా మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా మారనుంది.

మోడ్ ప్రయాణ సమయం ఖర్చు (సుమారు) ఎవరికి మంచిది?
ఎక్స్‌ప్రెస్‌వే (కారు/క్యాబ్) 2.5 గంటలు క్యాబ్ ₹7,400 (4 మందికి) + ₹675 టోల్ కుటుంబాలు, గ్రూపులు, లగేజ్
వందే భారత్ ట్రైన్ 4 గం. 45 ని. ₹1,075 – ₹1,900 సోలో, బడ్జెట్ ప్రయాణికులు
ఫ్లైట్ దాదాపు 3 గంటలు ₹4,000+ అత్యవసర సోలో ట్రిప్స్

 

భారీగా తగ్గిన దూరాభారం… విస్తృత అనుసంధానంతో ప్రాంతీయ అభివృద్ధి

పాత మార్గంతో పోలిస్తే కొత్త ఎక్స్‌ప్రెస్‌వే రూట్ మ్యాప్

ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల దిల్లీ–డెహ్రాడూన్ మధ్య దూరం కూడా గణనీయంగా తగ్గింది. పాత మార్గంలో సుమారు 235 కి.మీ ఉండగా, కొత్త మార్గంలో అది దాదాపు 212 కి.మీకి కుదిరింది. ముఖ్యంగా బాగ్‌పట్​, షామ్లీ, సహారన్‌పూర్ వంటి పట్టణాలు ఈ కారిడార్‌తో బాగా కలిసిపోయాయి. సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడంతో స్థానిక రవాణా కూడా సులభమవుతోంది. దీంతో ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వన్యప్రాణి రక్షణ కోసం ప్రత్యేక లివేటెడ్​ కారిడార్​.. పర్యాటక రంగానికి భారీ ఊతం

ఎక్స్‌ప్రెస్‌వే కింద సురక్షితంగా సంచరిస్తున్న వన్యప్రాణులు

ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో అత్యంత ప్రత్యేకతగా నిలిచింది రాజాజీ నేషనల్ పార్క్ గుండా నిర్మించిన 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్. ఆసియాలోనే అతి పొడవైన ఈ కారిడార్, అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసిన అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. ఏనుగులు సహా పెద్ద వన్యప్రాణులు కూడా సురక్షితంగా దాటేలా సుమారు 6 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేశారు. సౌండ్ బ్యారియర్లు, నియంత్రిత లైటింగ్, ప్రత్యేక అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడం ద్వారా జంతువులకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఎంతో అందమైన అడవుల గుండా ప్రయాణం ఆహ్లదకరంగా ఉంటుంది.

ప్రకృతిని కాపాడుతూ అడవుల మీదుగా నిర్మించిన వైల్డ్‌లైఫ్ కారిడార్

ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో 18 రకాల వన్యప్రాణులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. హరిద్వార్‌, డెహ్రాడూన్‌, ముస్సోరీ వంటి పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం వేగవంతం కావడంతో వీకెండ్ ట్రిప్స్ పెరగడం ఖాయం. చార్‌ధామ్ యాత్రలకు వెళ్లే భక్తులకు కూడా ఇది పెద్ద ఊరటగా, సౌకర్యవంతంగా మారనుంది. మొత్తం మీద ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తర భారతదేశ ఆర్థిక వ్యవస్థను, పర్యాటక రంగాన్ని, ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చే ప్రాజెక్టుగా నిలుస్తోంది.

Latest News