కుర్చీ దొరికితే వదలొద్దు… డీకే. శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కుర్చీ ఖాళీ లేదని..ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం శివకుమార్ మాత్రం తన చేతుల్లో ఏమీ లేదంటూనే..ఆశ పడటంలో తప్పులేదన్నారు

విధాత: కుర్చీ ఖాళీ లేదని..ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం శివకుమార్ మాత్రం తన చేతుల్లో ఏమీ లేదంటూనే..ఆశ పడటంలో తప్పులేదన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో డీకే. శివకుమార్ మాట్లాడుతూ ఎవరికీ కుర్చీ అంత సులభంగా దొరకదని.. కుర్చీ దొరికితే మాత్రం వదలొద్దంటూ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక సీఎం మార్పు వ్యవహారాన్ని మరింత వేడెక్కించాయి. బెంగళూరులో న్యాయవాదుల సంఘం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్ హాజరై మాట్లాడారు. ఇక్కడ చాలామంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా అందులో కూర్చోవట్లేదు. కానీ, మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు..ఒకవేళ దొరికితే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోవద్దు.. అందులో కూర్చోవాలని సూచించారు. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు. రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించే డీకే. శివకుమార్ అలా నర్మగర్భంగా మాట్లాడారని అంతా భావిస్తున్నారు.
రెండున్నరేళ్ల గడువుతోనే మార్పు ప్రచారం
కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం పదవి కోసం సిద్దరామయ్య, డీకేల మధ్య పోటీ ఏర్పడింది. అధిష్టానం అనేక కోణాల్లో తీవ్ర కసరత్తు చేసి చివరకు సిద్ధరామయ్యను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అయితే అప్పట్లో రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని..ఆ మేరకు అవగాహన ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు డీకే వర్గం ఎమ్మెల్యేలు సీఎం మార్పు అంశంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అయితే సిద్ధరామయ్యను మార్చి సీఎం పీఠంపై డీకేను కూర్చోబెడితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్ఠానం భయపడుతోంది. అందుకే ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం మార్పు వ్యవహారంలో డీకేను మౌనంగా ఉండమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇచ్చిన సంకేతాలతోనే డీకే ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారని తెలుస్తుంది