Leech In Nose | యువకుడిలో ముక్కులో జలగ..! వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన..!
Leech In Nose | వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. ఓ యువకుడి ముక్కులో నుంచి సజీవంగా ఉన్న జలగను తొలగించారు. నదిలో స్నానానికి వెళ్లిన యువకుడి ముక్కులోకి చొచ్చుకొని వెళ్లిన జలగ.. దాదాపు 20 రోజుల పాటు రక్తం పీలుస్తూ వచ్చింది. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి జలగను తొలగించారు.

Leech In Nose | వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. ఓ యువకుడి ముక్కులో నుంచి సజీవంగా ఉన్న జలగను తొలగించారు. నదిలో స్నానానికి వెళ్లిన యువకుడి ముక్కులోకి చొచ్చుకొని వెళ్లిన జలగ.. దాదాపు 20 రోజుల పాటు రక్తం పీలుస్తూ వచ్చింది. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి జలగను తొలగించారు. వివరాల్లోకి వెళ్లితే. యూపీ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సెసిల్ ఆండ్రూ గోమ్స్ (19)కి జూన్ 4న ఏదో ముక్కులో ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత రక్తం వచ్చింది.
అయితే.. మొదట పట్టించుకోలేదు. అయితే, సమస్య ఎక్కువ కావడంతో ఇటీవల వైద్యులను సంప్రదించాడు. సెసిల్‌కు ఈఎన్‌టీ స్పెషలిస్ట్ వైద్యుడు సుభాష్‌చంద్ర వర్మ పరీక్షలు చేశారు. ఎలాంటి వ్యాధి లేదని.. ముక్కులో జలగ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 24న డాక్టర్ సుభాష్ చంద్ర ఎండోస్కోపీ ద్వారా జలగను బయటకు తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ ఘటన వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన అని తెలిపారు.
భారత్‌లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. జూన్ 4న ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన సెసిల్.. నైనిటాల్ జిల్లాలోని భలుగడ్ నదిలో స్నానం చేస్తూ స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. ఈ నెల 8న మళ్లీ ఇంటికి చేరాడు. అప్పటికే ముక్కు నుంచి స్వల్పంగా రక్తం కారడం గమనించాడు. సాధారణంగానే ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని భావించాడు. ఆ తర్వాత తుమ్ములు రావడంతో పాటు తలనొప్పి సైతం ప్రారంభమైంది. రోజురోజుకు సమస్య ఎక్కువ కావడంతో వైద్యుడిని సంప్రదించాడు. టాబ్లెట్స్ వాడినా ఫలితం లేకపోయింది.
చివరకు నజరేత్ ఆసుపత్రిలో ఈఎన్ టీ సర్జన్ డాక్టర్ సుభాష్ చంద్ర వర్మను సెసిల్ సంప్రదించారు. దాంతో ఆయన పరీక్షలు చేయగా.. ముక్కులో జలగ కనిపించింది. ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేసి జలగను తొలగించారు. జలగ తన బరువు కంటే 8-9 రెట్లు ఎక్కువగా రక్తాన్ని తాగుతుందని డాక్టర్ తెలిపారు. జలగ శ్వాసనాళం, ఆహార గొట్టంలో ఇరుక్కుపోయి సెసిల్ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేదని వివరించారు.