బావిలో పడిన ఏనుగు సేఫ్…అడవిలోకి తరలింపు

కేరళలోని ఎర్నాకుళం జిల్లా మలయాట్టూర్ ప్రాంతంలోని కూవప్పరలో నివాస ప్రాంతంలోకి వచ్చి బావిలో పడిపోయిన ఒక అడవి ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించారు. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా మలయాట్టూర్ ప్రాంతంలోని కూవప్పరలో నివాస ప్రాంతంలోకి వచ్చి బావిలో పడిపోయిన ఒక అడవి ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించారు. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. జేసీబీ(ఎర్త్‌మూవర్‌)తో బావిలో నుంచి ఏనుగు బయటకు వచ్చేలా ఒక వాలు మార్గాన్ని (ర్యాంప్) తవ్వడం ద్వారా.. ఆ ఏనుగు బయటకు వచ్చేలా చేసి దానిని రక్షించారు.

మంగళవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చి, పొరపాటున బావిలో పడిపోయింది. అయితే, ఈ ప్రాంతంలో ఏనుగులు తరచూ గ్రామస్తులపై దాడులకు పాల్పడటం, పంట పొలాలను నాశనం చేస్తుండటంతో ఏనుగును రక్షించడానికి ముందుగా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారుల వాహనాలను, సహాయక చర్యలను అడ్డుకున్నారు. అటవీ శాఖ అధికారుల రెస్క్యూ ఆపరేషన్‌ను స్థానికులు అడ్డుకోవడంతో ఏనుగు రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

స్థానిక ప్రజల నిరసనలు, ఆందోళనల మధ్య దాదాపు 10 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమవ్వడంతో ఏనుగు సురక్షితంగా బావి నుంచి బయటపడింది. ఆ ఏనుగు తొండానికి గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బావి నుంచి ఏనుగు బయటకు రాగానే దానిని అడవిలోకి మళ్లించారు. ఆ తర్వాతా అటవీ శాఖ సిబ్బంది దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 

Latest News