Doda | జమ్మూ కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు సైనికుల వీరమరణం..!
Doda | జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు చెలరేగుతున్నాయి. ఇటీవల వరుసదాడులకు దిగుతున్నారు. దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దోడా జిల్లాలోని దేసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Doda | జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు చెలరేగుతున్నాయి. ఇటీవల వరుసదాడులకు దిగుతున్నారు. దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దోడా జిల్లాలోని దేసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పలు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతూ నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. మరో సైనికుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ఘటన అనంతరం బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదులను ఎరివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్ పోలీసుల రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దళాలు సోమవారం రాత్రి 7.45 గంటలకు దేసా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉరర్‌బాగి వద్ద జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో ఎన్‌కౌంటర్ మొదలైందని అధికారులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆర్మీ, పోలీసుల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతుందని.. సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగిందని ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఆ తర్వాత అక్కడ భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు పేర్కొంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారాలో 24 గంటల కిందట ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నియంత్రణ రేఖ దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు భారీ దాడికి సిద్ధమయ్యారు. అయితే, అంతకుముందే అప్రమత్తమైన పోలీసులు, ఆర్మీ సిబ్బంది కుట్రలను భగ్నం చేశారు.
జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే ఉగ్రవాదుల ఉద్దేశమని 268 బ్రిగేడ్ కేరాన్ సెక్టార్ కమాండర్ బీటీఐజీ ఎన్‌ఎల్ కుర్కర్ణి మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆపరేషన్ ధనుష్ గణనీయమైన విజయాన్ని సాధించిందని అన్నారు. కుప్వారా పోలీసులతో కలిసి సంయుక్త ప్రయత్నంలో కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LOC)పై చొరబాటు ప్రయత్నం విజయవంతంగా విఫలమైందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మూడు AK-47 రైఫిల్స్, నాలుగు పిస్టల్స్, ఆరు హ్యాండ్ గ్రెనేడ్‌లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, పాకిస్తాన్ మార్క్ సిగరెట్లు, ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. గతవారం కుల్గామ్ జిల్లాలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. కుల్గామ్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. జూన్ 9న, ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున, రియాసిలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. బస్సు కాలువలో పడి తొమ్మిది మంది చనిపోయారు. జూన్ 9 నుంచి 11 వరకు ఉగ్రవాదులు నాలుగుసార్లు దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత జూలై 8న కథువాలోని బద్నోటా ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్ చేస్తుండగా ఉగ్రమూకలు మెరుపుదాడి చేయగా.. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.