Typing Test | ‘టైప్‌’లో విఫ‌లం.. అటెండ‌ర్లుగా మారిన ముగ్గురు క్ల‌ర్క్‌లు

Typing Test | ఓ ముగ్గురు క్ల‌ర్కులు.. నిమిషానికి క‌నీసం 25 ప‌దాలు కూడా టైప్ చేయ‌లేక‌పోయారు.. దీంతో వారిని క్ల‌ర్కు పోస్టుల నుంచి అటెండ‌ర్ పోస్టుల‌కు మార్చారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది.

Typing Test | ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు కార్యాల‌యాలే కాదు.. ఏ చిన్న సంస్థ‌లోనైనా కంప్యూట‌ర్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ప్ర‌తి ప‌నికి కంప్యూట‌ర్‌ను వినియోగిస్తున్నారు. ఈ కంప్యూట‌ర్ వినియోగంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ దాని గురించి కాస్తంత జ్ఞానం సంపాదించాల్సిందే. అంతేకాదు.. కాస్తోకూస్తో టైప్ వ‌చ్చి ఉండాలి. మ‌రి వేగంగా టైప్ చేయ‌కున్న‌.. నిమిషానికి ఓ ఇర‌వై, ఇర‌వై ఐదు ప‌దాల‌న్న టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఓ ముగ్గురు క్ల‌ర్కులు.. నిమిషానికి క‌నీసం 25 ప‌దాలు కూడా టైప్ చేయ‌లేక‌పోయారు.. దీంతో వారిని క్ల‌ర్కు పోస్టుల నుంచి అటెండ‌ర్ పోస్టుల‌కు మార్చారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కాన్పూర్ క‌లెక్ట‌రేట్‌లో ఓ ముగ్గురు అభ్య‌ర్థులు కారుణ్య నియామ‌కాల కింద జూనియ‌ర్ క్ల‌ర్కులుగా విధుల్లో చేరారు. వారికి ఆ స‌మ‌యానికి టైప్ మీద ప‌రిజ్ఞానం లేదు. క‌నీసం టైప్ కూడా చేయ‌డానికి రాదు. దీంతో ఉద్యోగం ఇచ్చే స‌మ‌యంలో.. వారికి అధికారులు ఒక ష‌ర‌తు విధించారు. ఏడాది లోపు నిమిషానికి 25 ప‌దాలు టైప్ చేయాల‌ని ఆదేశించారు. వారికి ఏడాది త‌ర్వాత టైప్ ఎగ్జామ్ నిర్వ‌హించ‌గా, విఫ‌ల‌మ‌య్యారు. దీంతో వారికి ఇంక్రిమెంట్స్ ఆపేశారు.

ఇక రెండో ఏడాది 2025లో కూడా మ‌ళ్లీ టైప్ ఎగ్జామ్ కండ‌క్ట్ చేశారు ఆ ముగ్గురికి. అప్పుడు కూడా నిమిషానికి 25 ప‌దాలు టైప్ చేయ‌లేక‌పోయారు. దీంతో ఇంక్రిమెంట్స్ క‌ట్ చేయ‌డ‌మే కాదు.. దానికి కొన‌సాగింపుగా వారిని క్ల‌ర్కు పోస్టు నుంచి అటెండ‌ర్ పోస్టుకు బ‌దిలీ చేశారు. ప్ర‌స్తుతం ముగ్గురు కూడా అటెండ‌ర్ల పోస్టులో కొన‌సాగుతున్నారు. ఇక ఈ సారైనా టైప్ ప‌రీక్ష గ‌ట్టెక్కుతారో లేదో వేచి చూడాలి.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ రాజేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఏ ప్ర‌భుత్వ ఉద్యోగికి అయినా.. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. టైప్ కూడా చేయ‌డానికి రాక‌పోతే ఎలా..? జూనియ‌ర్ క్ల‌ర్కు పోస్టు నుంచి అటెండ‌ర్ పోస్టుకు డిమోష‌న్ చేయ‌డం కాన్పూర్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. ఏదో ఊరికే పోస్టింగ్‌లు ఇచ్చి చేతులు దులుపుకోవ‌డం స‌రికాదు.. క‌నీస అర్హ‌త‌లు ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

Latest News