మామల్లపురం తీరంలో అమ్మవారి విగ్రహం లభ్యం!

మామల్లపురం తీరంలో 200 కిలోల బరువున్న అమ్మవారి విగ్రహం లభ్యం. ఇది పురాతనదా? లేక పూజల కోసం వదిలివెళ్లారా? అన్న దానిపై అధికారులు విచారణ.

మామల్లపురం తీరంలో అమ్మవారి విగ్రహం లభ్యం!

విధాత : చారిత్రక కట్టడాలు, బంగారు వర్ణపు ఇసుక తిన్నెలతో ప్రసిద్ద పర్యాటక ప్రదేశంగా ఆకట్టుకునే తమిళనాడులోని మామల్లపురం(మహబలిపురం బీచ్) తీరంలో అమ్మవారి విగ్రహం లభ్యమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సముద్ర తీరంలో ఇసుక తిన్నెలో వెలుగుచూసిన అమ్మవారి(అమ్మన్) విగ్రహం నల్లటి శిలతో అద్బుతంగా చెక్కబడి 200 కిలోల బరువు, 4 అడుగుల ఎత్తు కలిగి ఉంది. విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని పోలిన ఈ విగ్రహం అక్కడే వెలుగుచూసిందా ? లేక ఎవరైనా పరికార(దోష నివారణ) పూజలు చేస్తూ విడిచిపెట్టి వెళ్లారా? అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

చెన్నైకి 60 కి.మీ దూరంలో బంగాళాఖాతం తీరంలో సుమారు 20 కి.మీ పొడవునా విస్తరించి ఉంది. పర్యాటకులకు సముద్ర స్నానాలు, సూర్యస్నానాలు, విండ్ సర్ఫింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ తో పర్యాటకులను మామల్లపురం బీచ్ ఆకట్టుకుంటుంది. ప్రపంచ ప్రసిద్ధ షోర్ టెంపుల్ (తీర దేవాలయం) ఈ బీచ్ పక్కనే ఉంది.

క్రీ.శ. 7-8వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణంగా. మామల్లాపురం(మహాబలిపురం) గుర్తింపు పొందింది. పల్లవ రాజు నరసింహవర్మన్(మామల్లన్) పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. పల్లవుల కాలంలోనే ఇక్కడ భారీ ఆలయాలు, చారిత్రాక కట్టడాల నిర్మాణాలు జరిగాయి. పల్లవులు ఈ తీర పట్టణాన్ని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కూడా నిర్మించారు. ఈ రేవు పట్టణం, ఏకశిలా రథాలు, పంచ రథాలు, రాతి గుహాలయాలు, తీర దేవాలయానికి ప్రసిద్ధి. ఈ చారిత్రాక పురాతన కట్టడాల సముదాయాలను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడటం విశేషం. మామల్లపురం తీర ప్రాంతంలో తరచూ ప్రాచీన కట్టడాలు, విగ్రహాలు లభ్యమవ్వడం కొనసాగుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

ఆకస్మిక తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యేకు షాక్ !
మందుబాబులపై యుద్దం ఎఫెక్ట్..తెలంగాణలో లిక్కర్ ధరల పెంపు?