మందుబాబులపై యుద్దం ఎఫెక్ట్..తెలంగాణలో లిక్కర్ ధరల పెంపు?
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం తెలంగాణలో లిక్కర్ ధరలపై పడబోతోంది. సీసాల కొరతతో మద్యం ధరలు 12-15% పెరగొచ్చన్న వార్తలు మందుబాబుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
విధాత, హైదరాబాద్ : ఎక్కడో పశ్చిమాసియాలోని ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దం ఎఫెక్ట్…ఇక్కడ తెలంగాణలోని మందుబాబులపై పడబోతుంది. నిన్నటిదాక ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన కొరత, ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు…తాజాగా ఆరోగ్య సంరక్షణకు వినియోగించే ఔషధాల(మందులు) ధరల పెంపు భారం మరింత అదనపు భారమైంది. సుమారుగా 900రకాల ఔషధాల ధరలను 20 శాతం నుంచి గరిష్ఠంగా 180 శాతం దాకా పెంచి విక్రయిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా కొత్తగా తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తుందన్న సమాచారం.. మందుబాబులకు తాగకుండానే కిక్కు ఎక్కించేంతగా ఆగం పట్టిస్తుంది. యుద్దం కారణంగా మాకు గాజు సీసాల కొరత ఏర్పడిందని..దీంతో వాటి ధరలు పెరిగిపోయినందునా… మద్యం ధరలను పెంచాలంటూ ప్రభుత్వం ముందు మద్యం కంపెనీలు ప్రతిపాదనలు పెట్టాయి. వచ్చే నెల మే నుండి లిక్కర్ ధరలు దాదాపు 12 నుండి 15 శాతం పెంచేందుకు అనుమతివ్వాలని మద్యం కంపెనీ(డిస్టరీ, బ్రూవరీస్ ) లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం మద్యం ధరల పెంపు ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తుండటంతో త్వరలోనే మద్యం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.
పశ్చిమాసియా నుంచే గాజు సీసాల దిగుమతి
నేచురల్ గ్యాస్ ను వినియోగించి తయారు చేసే గాజు సీసాలను ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాలలో నుండే ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత యుద్దంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నేచురల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడి.. గాజు సీసాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. నేచురల్ గ్యాస్ కొరత దెబ్బకు పలు గాజు సీసా తయారీ యూనిట్లు తమ ఉత్పత్తిని తగ్గించుకోగా.. మరికొన్ని యూనిట్లు పూర్తిగా మూసివేశారు. దీంతో దేశీయంగా గాజు సీసాల ఉత్పత్తి, సరఫరా 40 శాతం పడిపోవడంతో..వాటిని సమకూర్చుకోవడం లిక్కర్ తయారీ కంపెనీలకు భారం పెరిగింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20శాతం వరకు పెరిగాయి. ఈ పెరిగిన భారాన్ని వినియోగదారులపై వేసేందుకు డిస్టిలరీ కంపెనీలు సిద్దమయ్యాయి.
12-15 శాతం వరకు పెంచే అవకాశం
మద్యం.. బీర్ల ధరలు భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాదాపుగా 12-15 శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా.. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గడువు ముగిసి కూడా ఏడాది గడుస్తుండటంతో మద్యం కంపెనీలు ధరల పెంపుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం పెంచింది. ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల ధరలు కూడా పెరగడంతో మళ్లీ బీర్ల ధరలను కూడా పెంచాలని కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసిన డిస్టరీల యాజమాన్యాలు.. మద్యం ధరలను 12 శాతం నుంచి 15 శాతం వరకు పెంచాలని వినతి పత్రం కూడా అందించాయి. వారి ప్రతిపాదనలను పరిశీలించి తగిన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జ్యుడీషియల్ కమిటీ మద్యం ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తోంది. ఏటా 40 వేల కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని సమకూర్చే మద్యం వ్యాపార రంగం సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే మద్యం ధరల పెంపును 5 స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ వర్గాల సమాచారం. బాటిల్ సైజ్, బ్రాండ్, ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ ఆధారంగా చేసుకుని ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
వండర్ .. భవిష్యత్తులో మొక్కలతోనే విద్యుత్ వెలుగులు!
Viral Marriage | 68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram