భారత్ అథ్లెటిక్స్ చరిత్రలో గుర్విందర్ సింగ్ సరికొత్త రికార్డు!

2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌లో గుర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించారు. ఈ రేసును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు.

విధాత, హైదరాబాద్:   భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రేసర్‌గా గుర్విందర్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌లో గుర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించారు. ఈ రేసును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. రాంచీ వేదికగా జరుగుతున్న నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో పంజాబ్ స్ప్రింటర్ గుర్విందర్ సింగ్ సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించారు.

ఈ విజయంతో ఆయన కామన్వెల్త్, ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. అంతకుముందు అనిమేష్ కుజూర్ పేరిట ఉన్న జాతీయ రికార్డును గుర్విందర్ బద్దలు కొట్టి, దేశంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా నిలిచారు.

భారత్ అథ్లెటిక్స్ రంగంలో అదికూడ రన్నింగ్ రేసులో సరికొత్త జాతీయ రికార్డు నమోదవ్వడం అథ్లెటిక్స్ విభాగానికి కొత్త జోష్ ను ఇచ్చేదిగా కనిపిస్తుంది. క్రికెట్ ఆధిపత్యం కొనసాగుతున్న భారత క్రీడారంగంలో ముఖ్యంగా అథ్లెటిక్స్ క్రీడలలో గుర్విందర్ సింగ్ సాధించిన రికార్డు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

400 మీటర్ల పరుగులోనూ విశాల్ సరికొత్త జాతీయ రికార్డు

జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో క్వార్టర్-మైలర్ పరుగులో విశాల్ టి.కె 400 మీటర్ల పరుగును 44.98 సెకన్లలో పూర్తి చేసి ఈ విభాగంలో కొత్త రికార్డు సృష్టించడం గమనార్హం. 400 మీటర్ల పరుగులో గతేడాది ఇంటర్‌ స్టేట్‌ ఛాంపియన్‌షిప్ లో 45.12 సెకన్లతో తానే నమోదు చేసిన జాతీయ రికార్డును విశాల్ తిరగరాశాడు. విశాల్‌ తాజా టైమింగ్‌ ఈ సీజన్‌లో ఆసియాలోనే అత్యుత్తమం కావడం విశేషం. అయినప్పటకి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించడానికి ఈ టైమింగ్ సరిపోదు. కామన్వెల్త్ గేమ్స్‌కు క్వాలిఫై కావాలంటే 44.96 సెకన్లలో 400 మీటర్ల రేసును పూర్తి చేయాలి. ఈ ఫీట్‌కు విశాల్ 0.02 సెకన్ల దూరంలో నిలిచిపోయాడు.400 మీటర్ల పరుగు రేసును 45 సెకన్లలోపు పూర్తి చేయడం భారత అథ్లెట్లకు చాలా ఏళ్లుగా సవాల్‌గా మారిందిఈ సవాల్‌ను తమిళనాడుకు చెందిన డీకే విశాల్ ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

సరికొత్త నేషనల్ రికార్డ్స్ నమోదు చేసిన విశాల్ టీకే, గురిందర్ వీర్ సింగ్‌లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రదర్శన భవిష్యత్తులో అత్యున్నత వేదికపై భారత జెండాను రెపరెపలాడిస్తారనే నమ్మకం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా మినహా మరే భారత అథ్లెట్ ఒలింపిక్ మెడల్ సాధించలేదు.

 

Latest News