రాజకీయాలకే బీజేపీకి రాముడు: కపిల్ సిబల్

- ఇంకెన్నిసార్లు వాడుతారు?
- రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్న
న్యూఢిల్లీ : రాముడి విలువలను పాటించని బీజేపీ.. రాజకీయ లబ్ధి కోసం మాత్రం ఆయన పేరును పదే పదే వాడుకుంటున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఆరోపించారు. అయోధ్యలో రాముడి కోసం గొప్ప ఆలయం నిర్మిస్తున్నామని ప్రధాని మోదీ మంగళవారం చెప్పడంపై ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
‘రాముని రాక తథ్యం. తదుపరి శ్రీరామనవమి ప్రపంచ వ్యాప్తంగా సంతోషాలను పంచుతుంది’ అని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై సిబల్ బుధవారం ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘బీజేపీకి ప్రశ్న. రాజకీయ లబ్ధి కోసం ఇంకెన్నిసార్లు మీరు రాముడి పేరు వాడుకుంటారు? రాముడి శౌర్యం, పరాక్రమం, విధేయత, కరుణ, ప్రేమ, వినయం, ధైర్యం, సమర్ధతలను ఎందుకు అనుసరించరు?’ అని ఆయన ప్రశ్నించారు.
To the BJP
How many times will you use Lord Ram for political gain ?
Why don’t you embrace the virtues of Lord Ram :
His : valor, chivalry, loyalty, compassion, love, obedience, courage, and equipoise
Your governance does not display any of these virtues !
— Kapil Sibal (@KapilSibal) October 25, 2023
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీటిలో దేన్నీ పాటించడం లేదని విమర్శించారు. యూపీఏ రెండు ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గతేడాది మే నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సమాజ్‌వాది పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అన్యాయాలపై పోరాడేందుకు ఇన్సాఫ్ పేరుతో ఎన్నికలేతర వేదికను ప్రారంభించారు.