IAS Officer interaction with an Orphan Girl | మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా కలెక్టర్‌గా విధులు చేపట్టిన IAS అధికారి స్వప్నిల్ వాంఖడే ఒక చిన్నారి అనాథ బాలికతో మాట్లాడిన సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలెక్టర్ ఒక పెద్ద అధికారిలా కాక, మానవత్వం నిండిన మనిషిగా ఆ పాపతో మాట్లాడిన విధానం స్థానిక ప్రజలు, నెటిజెన్ల హృదయాలను గెలుచుకుంది.
వైరల్ అయిన వీడియోలో వాంఖడే, ఆ బాలికను తన వద్దకు పిలిపించుకుని దగ్గరగా వంగి మాట్లాడారు. “మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు?” అని స్నేహపూర్వకంగా అడగగా, చిన్నారి ఇంకా ముగ్గురు చెల్లెళ్లున్నారని, నలుగురిలో తాను పెద్దదానని తెలిపింది. బాలిక సమాధానం విన్న వెంటనే కలెక్టర్ అక్కడే ఉన్న సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) పిలిచి, ప్రతి అక్కాచెల్లెళ్లందరికీ ప్రభుత్వ పథకాల కింద రూ.4,000 చొప్పున సహాయం అందించాలని, అలాగే పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం రెడ్ క్రాస్ ఏమైనా సహాయం అందించగలదేమో చూడమని ఆయన అక్కడికక్కడే ఆదేశించారు. ఈ స్పందన బాలిక ముఖంపై చిరునవ్వు తీసుకురావడమే కాకుండా, అక్కడ ఉన్న వారందరికీ కలెక్టర్ చూపిన దయ, ఆదుకున్న తీరు మనసుకు హత్తుకున్నాయి.
ఈ వీడియోను దతియా అడ్మినిస్ట్రేషన్ అధికారిక Instagram ఖాతా ద్వారా పోస్టు చేయగా, కాసేపట్లోనే అది వైరల్ అయింది. తరువాత X (Twitter), Reddit, Facebook వంటి వేదికలపై వేలాది మంది షేర్ చేస్తూ కలెక్టర్‌ను ప్రశంసించారు. ఒకరు “మార్పు తెచ్చే ఒక్కరు ఉంటే చాలు, ప్రపంచం తప్పకుండా మారుతుంది.. మీకు అభినందనలు సర్” అని రాశారు. మరొకరు “ఈయనే నిజమైన కలెక్టర్. తక్షణ స్పందనే నిజమైన పరిపాలన” అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు “ఇలాంటి నిజాయితీ గల అధికారులే దేశానికి వరాలు” అని కొనియాడారు. మరికొందరు “దేవుడు మీలాంటి వారిని చల్లగా చూడాలి” అంటూ ఆశీర్వదించారు.
సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజాదరణ సంపాదించుకున్న స్వప్నిల్ వాంఖడే, తరచూ తన అనుభవాలను, అధికారిక కార్యక్రమాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. ఆయనకు Facebookలో 20,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే YouTubeలో 1,200 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2016 బ్యాచ్ IAS అధికారి అయిన వాంఖడే, దతియా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు రేవా జిల్లాలో జిల్లా పరిషత్ సీఈఓగా, అదనపు కలెక్టర్‌గా పనిచేశారు.
ఈ సంఘటన ఓ IAS అధికారికి కేవలం పరిపాలనా అధికారని మాత్రమే కాకుండా, సున్నితమైన మనసున్న నాయకుడిగా గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక చిన్నారి కన్నీటిని తుడిచి, ఆమెకు ధైర్యం చెప్పి వెంటనే చర్యలు తీసుకున్న స్వప్నిల్ వాంఖడే ప్రవర్తన, అధికార స్థానంలో ఉన్నవారందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.