Renaming IIT Bombay : ఐఐటీ బాంబే పేరుపై వివాదం

ఐఐటీ బాంబే పేరు ఐఐటీ ముంబైగా మార్చాలంటూ మహారాష్ట్ర సీఎం ప్రధాని మోదీకి లేఖ పంపనున్నట్లు వెల్లడించడంతో వివాదం రాజుకుంది. ఈ నిర్ణయంపై రాజ్ థాకరే తీవ్ర విమర్శలు.

Renaming IIT Bombay : ఐఐటీ బాంబే పేరుపై వివాదం

దేశంలో నగరాలు, రైల్వే స్టేషన్లు, కాలనీలకు పేర్లు మారుస్తూ వస్తున్న బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడు ఐఐటీలపై కన్నేశాయి. ఒకప్పటి బాంబే మహా నగరంలో ఐఐటీని ఏర్పాటు చేయడంతో దాని పేరు ఐఐటీ బాంబే గా ఉండిపోయింది. బొంబాయి నగరాన్ని ముంబై మార్చిన విషయం ప్రజలకు తెలిసిందే. ఒకప్పటి మద్రాస్ లో కూడా ఐఐటీ ఉండగా దాన్ని కూడా అందరూ ఐఐటీ మద్రాస్ గా పిలుస్తారు. కొద్ది సంవత్సరాల క్రితం మద్రాస్ కాస్తా చెన్నైగా మారింది. ఈ రెండు నగరాల్లోని ప్రఖ్యాత ఐఐటీల పై బీజేపీ నేతల కన్ను పడింది.
బాంబే ఐఐటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర ప్రసాద్ సింగ్ పాల్గొన్నారు. ఐఐటీ బాంబే గా ఇంకా కొనసాగిస్తున్నారా అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా ముంబై గా మార్చలేదా అని అన్నారు. ఐఐటీ మద్రాస్ పేరు కూడా మార్చలేదని అభినందించారు. 1958లో ఏర్పాటు చేసిన ఐఐటీ బాంబే డిపార్ట్ మెంట్ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీతో భాగస్వామ్యంగా ఉందన్నారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ ఐఐటీ ముంబై గా పేరు మార్చాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖలో పేరు మార్పు విషయాన్ని తెలియచేస్తానన్నారు. కొంత మంది నాయకులు వివాదం కోసం ఈ అంశాన్ని లేవనెత్తుతారు, వారు తమ పిల్లలు చదివే పాఠశాలలు కూడా మర్చిపోతారంటూ పరోక్షంగా శివసేన, ఎంఎన్ఎస్ నాయకులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తమ పిల్లలు చదివిన స్కూళ్ల పేర్లు మార్చాలని ఎప్పుడూ ఫిర్యాదు చేయరన్నారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ థాకరే, ఎంఎన్ఎస్ నాయకుడు రాజ్ థాకరే సంతానం బాంబే స్కాటిష్, డాన్ బాస్కో ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివారన్నారు. బాంబే ను 1995 సంవత్సరంలో మరాఠా దేవత ముంబాదేవీ పేరుతో ముంబై గా మార్చిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వ్యాఖ్యలపై రాజ్ థాకరే ఘాటుగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముంబై ను తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తున్నదని, చండీ గఢ్ మాదిరి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. కుట్రలో భాగంగానే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ను విస్తరించారని, గుజరాత్ బార్డర్ వరకు తీసుకువెళ్లారన్నారు. దీంతో మహారాష్ట్ర కు వచ్చే ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించవచ్చన్నారు. ముంబై మహానగరంపై గుజరాత్ కు చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కు రహస్య ఎజెండా ఉందన్నారు.