‘ఇండియా’కు మెజార్టీ ఖాయం

ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేస్తున్నారని, లోక్‌సభ ఎన్నికలు నిష్పాక్షికంగా లేవని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

‘ఇండియా’కు మెజార్టీ ఖాయం

పదేళ్ల అన్యాయ కాలంపై జనాగ్రహం

5 న్యాయాలు, 25 గ్యారెంటీలకు స్పందన

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌

న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేస్తున్నారని, లోక్‌సభ ఎన్నికలు నిష్పాక్షికంగా లేవని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. కానీ.. తమ ‘ఐదు న్యాయాలు, 25 గ్యారెంటీ’లకు ప్రజల నుంచి వస్తున్న స్పందన గమనిస్తే ఇండియా కూటమి స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను పక్షపాతంతో నిర్వహించేందుకు ప్రధాని మోదీ చేస్తున్న అన్ని ప్రయత్నాలనూ దేశ ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరిస్తారని అన్నారు. పదేళ్ల అన్యాయకాలం పట్ల ప్రజల్లో అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలిపారు. శత్రు దేశాల్లోకి ప్రవేశించి మరీ దాడులు చేస్తామని ఇటీవల ప్రధాని, రక్షణ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై జైరాంరమేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు న్యాయాలు, పాతిక గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపించారు. ‘ప్రతిపక్ష నేతలపై చర్యలు తీసుకుంటూ సాగుతున్న ఈ ఎన్నికలు పక్షపాతంతో ఉన్నాయి. అయినప్పటికీ.. ఇండియా కూటమికి ఉన్న జనాభిమానం స్పష్టమైన మెజార్టీని అందిస్తుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

గతంలో ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన జైరాంరమేశ్‌.. నితీశ్‌కుమార్‌ నిష్క్రమించినప్పటికీ ఇండియా కూటమి భద్రంగానే ఉన్నదని చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి, మెజార్టీ మార్కు 272 స్థానాలను దాటుతాయని అన్నారు. ఏడు దశల్లో సాగనున్న లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19న మొదలు కానున్నాయి. జూన్‌ 1న చివరి దశ పోలింగ్‌ ఉంటుంది. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.