20 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం…ఇండియా కూటమికి మెజార్టీ ఖాయం..మూడు రోజులకే ప్రధాని ఖరారు

20 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం...ఇండియా కూటమికి మెజార్టీ ఖాయం..మూడు రోజులకే ప్రధాని ఖరారు

20 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం…ఇండియా కూటమికి మెజార్టీ ఖాయం..మూడు రోజులకే ప్రధాని ఖరారు
  • మూడు రోజులకే ప్రధాని ఖరారు
  • ఐదేళ్లూ ఒకే ప్రధాని కొనసాగుతారు
  • ఇండియా కూటమికి మెజార్టీ ఖాయం
  • 20 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం
  • దేశంలో ఎన్నికలు అందాల పోటీ కాదు
  • వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్య ఉంటాయి
  • కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌

చండీగఢ్‌: ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు మారుతారన్న బీజేపీ విమర్శలను కాంగ్రెస్‌ గట్టిగా తిప్పికొట్టింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన, నిర్ణయాత్మక మెజార్టీ ఖాయమని, తమ ప్రధాని ఐదేళ్లు కొనసాగుతారని స్పష్టం చేసింది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు విడుదల కాగానే మూడు రోజుల వ్యవధిలోనే తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చండీగఢ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. ‘జూన్‌ 4వ తేదీన ఇండియా కూటమి స్పష్టమైన, నిర్ణయాత్మక తీర్పు పొందబోతున్నది. 2004లో జరిగినట్టే 20 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం కాబోతున్నది’ అని ఆయన అన్నారు. 2004 ఎన్నికల్లో ‘భారత్‌ వెలిగిపోతున్నది’ అంటూ అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసినా.. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆ పార్టీని అధికారం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరని పదేపదే ప్రశ్నిస్తున్నవారికి నేను చెబుతున్నాను. 2004లో కాంగ్రెస్‌, దాని భాగస్వామ్య పక్షాలు విజయం సాధించిన మూడు రోజుల్లోనే మన్మోహన్‌సింగ్‌ పేరును ప్రధానిగా ప్రకటించిన విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను’ అని జైరాం రమేశ్‌ చెప్పారు. ‘ఈసారి మూడు రోజులు కూడా అవసరం లేదు. ఒక వ్యక్తి ఐదేళ్లపాటు ప్రధానిగా ఉంటారు.. ప్రభుత్వాన్ని నడిపిస్తారు’ అని అన్నారు. ప్రధాని అభ్యర్థిని ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు ప్రజాస్వామిక పద్ధతిలో ఎంపిక చేస్తాయని తెలిపారు.

మన దేశంలో ఎన్నికలు అందాల పోటీ కాదు. మన దేశంలో ఎన్నికలు పార్టీల మధ్య జరుగుతాయి. మన ప్రజాస్వామ్యం పార్టీల కేంద్రంగా ఉండేది. వ్యక్తి కేంద్రంగా ఉండేది కాదు. అందుకే ప్రధాని ఎవరు అని పదేపదే అడిగే ప్రశ్న తప్పు ప్రశ్న. సరైన ప్రశ్న ఏంటంటే.. ఏ పార్టీ? ఏ కూటమి ప్రజాతీర్పును పొందుతాయి? అనేదే’ అని జైరాంరమేశ్‌ అన్నారు. శనివారం హర్యానాలోని పది సీట్లకు పోలింగ్‌ జరుగనుండగా.. దాని పక్కనే ఉన్న పంజాబ్‌లోని 13 సీట్లకు, చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంత స్థానానికి జూన్‌ 1న చివరి దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. తొలి రెండు దశల పోలింగ్‌ ముగియడంతోనే ఇండియా కూటమికి స్పష్టమైన, నిర్ణయాత్మక మెజార్టీ వస్తుందనే సంకేతాలు ఉన్నాయని జైరాం రమేశ్‌ తెలిపారు. ఇప్పటి వరకూ 428 సీట్లకు పోలింగ్‌ ముగిసిందని, తొలి రెండు దశల్లో ముగిసిన పోలింగ్‌తో దక్షిణాది నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అన్నారు. మిగిలిన సగభాగంలో బీజేపీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని చెప్పారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఇండియా కూటమి, కాంగ్రెస్‌ మరింత బలంగా ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్‌ 19 తర్వాత ప్రధాని మోదీ భాష మారిపోయిందని అన్నారు. ఏప్రిల్‌ 19 తర్వాత మోదీ పూర్తిగా హిందూ, ముస్లిం అంశాలపై, మతతత్వ అంశాలతో ప్రచారం చేస్తున్నారని, వికసిత్‌ భారత్‌ అన్న మాటగానీ, మోదీ గ్యారెంటీ లేదా రైతులు, యువత, మహిళలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సమస్యల ప్రస్తావనే తేవడం లేదని గుర్తు చేశారు.