John Abraham | మీరు ‘మరణాన్ని’ అమ్మతున్నారు.. పాన్‌మసాలా, గుట్కా యాడ్స్‌లో సినీ నటులు నటించడంపై జాన్‌ అబ్రహం ఆగ్రహం

బాలీవుడ్‌ నటులు కొన్ని వాణిజ్య ప్రటకటనల్లో నటించడంపై అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఒక పాన్‌మసాలా యాడ్‌లో నటించిన అమితాబ్‌ బచ్చన్‌.. తీవ్ర విమర్శలు ఎదురవడంతో తదుపరి దాని నుంచి తప్పుకున్నాడు కూడా

John Abraham | మీరు ‘మరణాన్ని’ అమ్మతున్నారు.. పాన్‌మసాలా, గుట్కా యాడ్స్‌లో సినీ నటులు నటించడంపై జాన్‌ అబ్రహం ఆగ్రహం

ముంబై : బాలీవుడ్‌ నటులు కొన్ని వాణిజ్య ప్రటకటనల్లో నటించడంపై అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఒక పాన్‌మసాలా యాడ్‌లో నటించిన అమితాబ్‌ బచ్చన్‌.. తీవ్ర విమర్శలు ఎదురవడంతో తదుపరి దాని నుంచి తప్పుకున్నాడు కూడా! బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం (actor John Abraham) మరోసారి ఈ అంశంపై చర్చను లేవనెత్తాడు. తన సహచర నటులు పాన్‌ మసాలా, గుట్కా యాడ్స్‌లో నటించడంపై తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. పాన్‌ మసాలా, గుట్కా (paan masala and gutka) ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో అజయ్‌దేవగన్‌, అక్షయ్‌కుమార్‌, షారూఖ్‌ ఖాన్‌ వంటివారు నటించారు. రణ్‌వీర్‌ అలహాబాదియాస్‌ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్‌ అబ్రహం.. ఒకవైపు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ప్రమోట్‌ చేసే నటులు మరోవైపు పాన్‌ మసాలా ఉత్పత్తుల యాడ్స్‌లో నటించడంపై అసహనం వ్యక్తం చేశాడు. తానైతే తన కోసం ఎప్పటికీ ‘చావు’ను అమ్మబోనని స్పష్టం చేశాడు. తన ఫ్యాన్స్‌కు ఆదర్శంగా ఉండాలని తాను భావిస్తానని తెలిపాడు. తాను చెప్పేది తానే ఆచరించకపోతే వారు తన చిత్తశుద్ధిని శంకిస్తారని అన్నారు. ‘నేను నా జీవితాన్ని ఆదర్శంగా గడిపినా, నేను చెప్పేది నేనే ఆచరించినా (I practice what I preach) అప్పుడు నేను రోల్‌ మోడల్‌ (role mode) అవుతాను. కానీ.. ప్రజల ముందు ఒకలా, వారి వెనుక మరోలా నేను వ్యవహరిస్తే దానిని వారు గుర్తిస్తారు’ అని జాన్‌ అబ్రహం కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

‘కొందరు వ్యక్తులు ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతుంటారు. అదే వ్యక్తులు పాన్‌ మసాలాను ప్రోత్సహిస్తారు. నా తోటి నటులందరినీ నేను ప్రేమిస్తాను. ఎవరినీ అగౌరవపర్చను. నేను నా గురించే మాట్లాడుతున్నానని స్పష్టం చేయదల్చుకున్నా. కానీ.. నేను చావును అమ్మబోను. ఎందుకంటే అది మూల సూత్రానికి సంబంధించిన అంశం. పాన్‌ మసాలా పరిశ్రమ వార్షిక టర్నోవర్‌ (turnover for the paan masala industry is Rs 45,000 crore) 45వేల కోట్ల రూపాయలన్న విషయం మీకు తెలుసా? ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమకు మద్దతు ఇస్తున్నది. అందుకే అది చట్ట వ్యతిరేకం కాదు’ అని జాన్‌ అబ్రహం అన్నాడు.

ఇటువంటి కంపెనీలకు మద్దతు పలకకూడదని తాను నిర్ణయించుకున్నానని జాన్‌ అబ్రహం తెలిపాడు. ‘పాన్‌ మసాలాలు మౌత్‌ ఫ్రెషనర్లు మాత్రమేనని కొందరు చెప్పే సాకులతో నాకు సంబంధం లేదు. మీరు చావును అమ్ముతున్నారు. దానితో మీరు ఎలా బతకగలరు?’ అని ఆయన ప్రశ్నించారు. తాను ఏ సహచర నటులను చులకన చేయదల్చుకోలేదని, తాను నమ్మినదే చెబుతున్నానని స్పష్టం చేశాడు.

పాన్‌మసాలా, గుట్కా బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల్లో నటించినందుకు గతంలో అజయ్‌దేవగన్‌ (Ajay Devgn), అక్షయ్‌కుమార్‌పై (Akshay Kumar) విమర్శలు వచ్చాయి. అయితే.. ఇకపై తాను అటువంటి ప్రమోషనల్‌ యాడ్స్‌లో నటించబోనని అక్షయ్‌కుమార్‌ స్పష్టం చేశాడు. సదరు కంపెనీతో తన కాంట్రాక్టు ముగియడానికి ముందు చిత్రీకరించిన యాడ్స్‌ ప్రసారం అవుతున్నాయని, వచ్చే నెలతో ఆ కాంట్రాక్ట్‌ ముగిసిపోతుందని ఆయన ఎక్స్‌లో వెల్లడించాడు. తాను పొగాకు లేదా పొగాకు ఉత్పత్తులను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించబోనని, అదే సమయంలో విమల్‌ ఇలాచీ యాడ్‌లో నటించినందుకు వచ్చిన విమర్శలను గౌరవంగా స్వీకరిస్తూ దాని నుంచి వెనక్కు తగ్గుతున్నానని ప్రకటించాడు.