DK Shivakumar : నేను కాంగ్రెస్ వాదిగానే చనిపోతా, గాంధీ కుటుంబం నాకు దైవం
కాంగ్రెస్ వాదిగానే చనిపోతా… గాంధీ కుటుంబం నాకు దైవం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆర్ఎస్ఎస్ గీతం వివాదంపై స్పందన.

DK Shivakumar | తాను కాంగ్రెస్ వాదిగానే పుట్టా… కాంగ్రెస్ వాదిగానే చనిపోతానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Karnatka Deputy CM DK Shivkumar) చెప్పారు. తాను కాంగ్రెస్ సిద్దాంతానికి కట్టుబడి ఉన్నా… గాంధీ కుటుంబం తనకు దైవమని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం(RSS Anthem) ఆలపించడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై విమర్శలు చెలరేగాయి. దీనిపై ఆయన స్పందించారు. తాను ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం పాడడంపై కొందరు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో బీజేపీని(BJP) విమర్శించే సమయంలో ఆయన ప్రార్థనా గీతం పాడారు. దీనిపై కాంగ్రెస్ నాయకులే డీకే శివకుమార్ పై విమర్శలు చేశారు. బీజేపీలో తనకు చేరే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. ఈ గీతం పాడినందుకు డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నాయకులు బికె హరిప్రసాద్(BK Hariprasad) కోరారు. మరో వైపు ఈ విషయాన్ని తమ పార్టీ నాయకత్వం చూసుకుంటుందని మంత్రి జి. పరమేశ్వర చెప్పారు. అవసరమైతే డీకే శివకుమార్ పై పార్టీ నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటపై అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చే క్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం పాడారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెబుతూ డీకే శివకుమార్ ఈ గీతం పాడారు. అప్పుడు బీజేపీ సభ్యులు డీకే శివకుమార్ కు మద్దతుగా బల్లలు చరిచి మద్దతిచ్చారు. మరో వైపు ఈ ప్రార్థనా గీతాన్ని రికార్డుల నుంచి తొలగించవద్దని కూడా బీజేపీ కోరింది.