రేవణ్ణ వీడియోల 25వేల పెన్‌డ్రైవ్‌లు కర్ణాటకలో పంచారు

లోక్‌సభ ఎన్నికలకు ముందు గత నెలలో ప్రజ్వల్‌ రేవణ్ణవిగా చెబుతున్న వీడియోలను 25వేల పెన్‌డ్రైవ్‌లలో ఎక్కించి కర్ణాటక వ్యాప్తంగా పంపిణీ చేశారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి మంగళవారం అన్నారు

రేవణ్ణ వీడియోల 25వేల పెన్‌డ్రైవ్‌లు కర్ణాటకలో పంచారు

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపణ
సోషల్‌ మీడియాలో పెట్టినవారిపై చర్యలేవని ప్రశ్న

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు ముందు గత నెలలో ప్రజ్వల్‌ రేవణ్ణవిగా చెబుతున్న వీడియోలను 25వేల పెన్‌డ్రైవ్‌లలో ఎక్కించి కర్ణాటక వ్యాప్తంగా పంపిణీ చేశారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి మంగళవారం అన్నారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా పంచేందుకు కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కుట్ర చేశారని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం నియమించిని సిట్‌ అంటే స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ కాదని, సిద్దరామయ్య ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌, శివకుమార్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ అని ఆయన ఆరోపించారు.

తొలుత పెన్‌డ్రైవ్‌లను డీకే శివకుమార్‌ సోదరుడు సురేశ్‌ పోటీ చేస్తున్న బెంగళూరు రూరల్‌ ఏరియాలో పంచారని, తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌ ఈ విషయంలో రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమారస్వామి ఆరోపించారు. ఏప్రిల్‌ 21వ తేదీన సాయంత్రం 8 గంటల ప్రాంతంలో తమ ఏజెంట్‌ పూర్ణచంద్రకు ఒక వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చిందని, అందులో ప్రజ్వల్‌ రేవణ్ణ అసభ్య వీడియోలు చూడాలంటే తమ వాట్సాప్‌ చానల్‌ను ఫాలో అవ్వాలని ఉన్నదని తెలిపారు.

ఇదే వాట్సాప్‌ చానల్‌లో ‘ప్రజ్వల్‌ వీడియోల విడుదలకు కౌంట్‌డౌన్‌’ అని ఉన్నదని పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తుల పేర్లను పూర్ణచంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. వీళ్లు మహిళల ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే వెంటనే వారి నివాసాల్లో సోదాలు నిర్వహించి, వారిని పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టాలి. ఫిర్యాదు ఉన్నప్పటికీ ఆ ఐదుగురు వ్యక్తులపై చర్యలు ఎందుకు లేవు? అని ఆయన ప్రశ్నించారు.