Cough Syrup Tragedy | మధ్యప్రదేశ్‌లో దగ్గు టానిక్ విషాదం : 14కు పెరిగిన చిన్నారుల మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన కఫ్ సిరప్ విషాదం..! నిషేధిత కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా 14 మంది చిన్నారుల మృతి, ప్రభుత్వ వైద్యుడు అరెస్టు. తమిళనాడు ఫార్మా సంస్థపై కేసు, SIT దర్యాప్తు ప్రారంభం.
Madhya Pradesh syrup tragedy: 14 children dead, government doctor arrested for prescribing banned Coldrif syrup
భోపాల్, అక్టోబర్ 6 (విధాత):
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో చోటుచేసుకున్న దగ్గు మందు దుర్ఘటన దేశాన్నే కుదిపేసింది. గత నెల ప్రారంభం నుంచి చిన్నారుల్లో జ్వరాలు, మూత్ర సంబంధ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించగా, చికిత్స పొందుతూ 9 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఆ సంఖ్య 14కు పెరిగింది. ఈ విషాదానికి కారణమైన టానిక్ పేరు ‘కోల్డ్రిఫ్ (Coldrif) — తమిళనాడు లోని కాంచీపురం కేంద్రంగా ఉన్న శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన సిరప్.
ప్రభుత్వం ప్రమాదకరమైన ఈ సిరప్‌ను తక్షణమే నిషేధించగా, పిల్లలకు ఈ మందు రాసిన ప్రభుత్వ వైద్యుడు డా. ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని 105, 276 సెక్షన్లు, అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని 27A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చింద్వారా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ పాండే వెల్లడించిన వివరాల ప్రకారం, సోని తన ప్రైవేట్ క్లినిక్‌లో చిన్నారులకు ఈ టానిక్ రాసి ఇచ్చారు. ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్ పరీక్షల్లో కోల్డ్రిఫ్ సిరప్‌లో డైఈథిలీన్ గ్లైకాల్ (Diethylene Glycol)46.28% వాల్యూమ్ ఉన్నట్టు తేలింది — ఇది మానవ శరీరానికి అత్యంత హానికరమైన రసాయనం.
ఈ ఫలితాలు బయటపడిన వెంటనే ప్రభుత్వం డా. సోనిని సస్పెండ్ చేసి, ఆయనను జబల్‌పూర్ రీజినల్ ఆఫీసుకు అటాచ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులో — “చిన్నారుల సమస్యలను సరైన సమయంలో గుర్తించి, చికిత్స అందించి ఉంటే వారి ప్రాణాలు నిలబడేవి. కానీ వైద్యుడి నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసింది” అని పేర్కొంది. ఇదే సమయంలో, పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. ఈ బృందం త్వరలో తమిళనాడు వెళ్లి ఆ సంస్థ తయారీ కేంద్రం, పంపిణీ లింకులు, రసాయన మూలాలను పరిశీలించనుంది. తమిళనాడు పోలీసుల సహకారం కోరినట్లు కూడా అజయ్ పాండే తెలిపారు. ఇప్పటికే చింద్వారా, పరిసర ప్రాంతాల్లోని ఫార్మసీలపై దాడులు జరిపి సిరప్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. చింద్వారా, పరాసియా, చౌరాయ్, పాంధుర్ణ ప్రాంతాల నుంచి చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. కొందరు నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రస్తుతం ఎనిమిది మంది చిన్నారులు నాగ్‌పూర్‌లోనే చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ₹4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

తమిళనాడు ల్యాబ్ టెస్టుల్లో కూడా అదే బ్యాచ్‌లోని సిరప్‌లో డైఈథిలీన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్టు తేలింది. ఈ రసాయనం మానవ మూత్రపిండాలపై ప్రభావం చూపి శరీరంలోని ద్రవ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇటువంటి ఘటనలు గతంలో గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలోనూ చోటుచేసుకున్నాయని ఆరోగ్యనిపుణులు గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మరియు ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర శుక్లా మాట్లాడుతూ – “ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. నిందితులపై కఠిన చర్యలు తప్పవు. తక్షణమే సిరప్ విక్రయాలు నిషేధించాం, బాధ్యులపై కేసులు నమోదు చేశాం. పిల్లల ప్రాణాలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదిలేదు” అని అన్నారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరోగ్యశాఖ అధికారులు ఔషధ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని సూచనలు ఇచ్చారు. ఇకపై ప్రతి బ్యాచ్ మందు విక్రయానికి ముందు ల్యాబ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా చిన్నారుల ఔషధ భద్రతపై పునరాలోచన ప్రారంభమైంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఎంతటి విపత్తు సంభవిస్తుందో మధ్యప్రదేశ్ ఘటన మరోసారి గుర్తు చేసింది. నిర్లక్ష్యంగా తయారైన ఈ టానిక్, ఎంతోమంది ఎన్నో చిన్నారుల ప్రాణాలను బలిగొని, భారత ఔషధ పరిశ్రమకు తీరని మచ్చగా, ఓ హెచ్చరికగా నిలిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram