రాజ్యసభతో మన్మోహన్ 33 ఏండ్ల అనుబంధానికి నేటితో తెర
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్(91) రాజ్యసభ పదవీ కాలం నేటితో ముగియనుంది. దీంతో ఆయనకు రాజ్యసభతో ఉన్న 33 ఏండ్ల అనుబంధానికి నేటితో తెరపడనుంది. మన్మోహన్‌సింగ్ సహా 54 మంది ఎంపీలకు రాజ్యసభ మంగళ, బుధవారాల్లో వీడ్కోలు పలకనుంది. రాజ్యసభ పదవీకాలం ముగిసిన వారిలో 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలో పలు సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబరులో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 2004 నుంచి 2014 వరకు పదేండ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్ ఖాళీ చేయనున్న స్థానంలో ఇటీవల రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. సోనియా రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయ, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రి నారాయణ రానె, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పదవీకాలం బుధవారంతో ముగియనుంది.
రాజ్యసభ పదవీకాలం ముగిసిన ఈ కేంద్ర మంత్రుల్లో అశ్విని వైష్ణవ్ మినహా అందరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్‌లకు మరోసారి రాజ్యసభ పదవీకాలం లభించింది. ఏప్రిల్ 2వ తేదీన 49 మంది సభ్యులు పదవీ విరమణ చేయగా, ఏప్రిల్ 3న మన్మోహన్ సింగ్, మరో నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి ఆరుగురు పదవీ విరమణ పొందనున్న 54 మందిలో తెలంగాణ, ఏపీ నుంచి ముగ్గురు చొప్పున ఆరుగురు ఉన్నారు. తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీ విరమణ పొందనున్నారు. ఇందులో వద్దిరాజు రవిచంద్ర మళ్లీ ఎన్నికయ్యారు. ఇక ఏపీ నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ విరమణ పొందారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram