ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో పలు ప్రాంతీయ పార్టీల విలీనం

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షం కొత్తరూపాన్ని సంతరించుకుంటుందని ఎన్సీపీ (శరత్‌చంద్రపవార్‌) చీఫ్‌ శరద్‌పవార్‌ చెప్పారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాయని తాను భావిస్తున్నట్టు తెలిపారు.

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో పలు ప్రాంతీయ పార్టీల విలీనం

ప్రతిపక్షం రూపుమారిపోతుంది
కాంగ్రెస్‌లో గట్టి పట్టు సాధించిన రాహుల్‌
ప్రతిపక్షాలతోనూ సయోధ్య
ఎన్సీపీ (పవార్‌) నేత శరద్‌పవార్‌

న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షం కొత్తరూపాన్ని సంతరించుకుంటుందని ఎన్సీపీ (శరత్‌చంద్రపవార్‌) చీఫ్‌ శరద్‌పవార్‌ చెప్పారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాయని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని, అది ఆ పార్టీకి మంచి చేస్తుందని చెప్పారు. అది మీ పార్టీకి కూడా వర్తిస్తుందా? అన్న ప్రశ్నకు.. కాంగ్రెస్‌ పార్టీకి, ఎన్సీపీ (పవార్‌) పార్టీకి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదని బదులిచ్చారు. ‘సైద్ధాంతికంగా మేం గాంధీ, నెహ్రూ ఆలోచనా విధానానికి చెందినవాళ్లమే’ అని ఆయన తెలిపారు. ఆ వెంటనే ఆయన ఈ విషయంలో తానేమీ వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని అన్నారు. ‘పార్టీ సహచరులను సంప్రదించకుండా నేనేమీ చెప్పను. సైద్ధాంతికంగా మేం వారికి (కాంగ్రెస్‌) దగ్గరగానే ఉన్నాం. వ్యూహం విషయంలో లేదా తదుపరి చర్యలకు సంబంధించి నిర్ణయాలు ఉమ్మడిగా తీసుకుంటాం’ అని వివరణ ఇచ్చారు.

ఉద్ధవ్‌ ఠాక్రె నేతృత్వంలోని శివసేన (ఉద్ధవ్‌) కూడా భావ సారూప్యం కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా సానుకూలంగా ఉందని శరద్‌పవార్‌ చెప్పారు. అనేక రాజకీయ పార్టీలు బీజేపీని, ప్రధాన మంత్రి మోదీని ఇష్టపడటం లేదని అన్నారు. అవి కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు దేశ ప్రజల మనోభీష్టం మోదీకి వ్యతిరేకంగా మారుతున్నదని స్పష్టంచేశారు. రాహుల్‌పై ప్రశంసలు కురిపించిన శరద్‌పవార్‌.. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన గణనీయమైన మద్దతు పొందుతున్నారని చెప్పారు. అదే విధంగా పలు ప్రాంతీయ పార్టీలతో కూడా సంబంధాలు పెంపొందించుకుంటన్నారని అన్నారు.

‘మొత్తంగా నేను చెప్పదల్చుకున్నది.. మేం కలిసి పనిచేయాలని పరిస్థితులు డిమాండ్‌ చేస్తున్నాయనే ఆలోచనలో ప్రతిపక్షం ఉన్నది. మేం ఎన్నికైతే సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలం’ అని శరద్‌పవార్‌ స్పష్టం చేశారు.