RSS | ఔరంగజేబ్ వారసులు తప్ప ఎవరైనా ఆరెస్సెస్‌లోకి రావొచ్చు: మోహన్ భాగవత్
భారతీయులు వేర్వేరు మతాలను, భిన్న జీవన శైలిని అనుసరించినప్పటికీ వారంతా ఒకే సంస్కృతిని కలిగి ఉంటారని ఆరెస్సెస్ అగ్రనేత మోహన్ భాగవత్ చెప్పారు. వివిధ విశ్వాసాలు, వర్గాలు, కులాల వారు శాఖల్లో చేరవచ్చని అన్నారు.

RSS | భారత మాతను. భగ్వా జండాను గౌరవించేవారు ఆరెస్సెస్‌లో చేరవచ్చని ఆ సంస్థ అగ్రనేత మోహన్ భాగవత్ చెప్పారు. అయితే.. ఔరంగజేబ్ వారసులకు మాత్రం సంఘ్‌లో ప్రవేశానికి అర్హత లేదని అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన వారణాసికి వచ్చారు. ఒక శాఖ సమావేశంలో సభ్యుడి ప్రశ్నకు భాగవత్ బదులిస్తూ.. కుల వివక్ష, పర్యావరణ సమస్యలు, ఆర్థిక సవాళ్ల వంటి సమస్యలను పరిష్కరించేందుకు బలవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు. తాను తన పొరుగు ముస్లింను శాఖకు తీసుకురావచ్చునా? అన్న సదరు సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. భారత్ మాతా కీ జై అని నినదించేవారు, కాషాయ పతాకాన్ని గౌరవించే వారు మాత్రమే అర్హులని చెప్పారు. మత ప్రాతిపదికన వివక్షను ఆరెస్సెస్ సిద్ధాంతం అంగీకరించదని భాగవత్ తెలిపారు. భారతీయులు వేర్వేరు మతాలను, భిన్న జీవన శైలిని అనుసరించినప్పటికీ వారంతా ఒకే సంస్కృతిని కలిగి ఉంటారని చెప్పారు. వివిధ విశ్వాసాలు, వర్గాలు, కులాల వారు శాఖల్లో చేరవచ్చని అన్నారు.
ఔరంగజేబ్ అప్రస్తుతం
ఈ రోజు ఔరంగజేబ్ అప్రస్తుతమని అంతకు ముందు ఆరెస్సెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ కొన్ని హిందూత్వ గ్రూపులు నాగపూర్‌లో సృష్టించిన విధ్వంసాన్ని ఖండిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సమాజానికి ఎలాంటి రకమైన హింస కూడా మంచిది కాదవు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకొని ఉంటారని భావిస్తున్నాను’ అని బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆరెస్సెస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ చెప్పారు. ఈ రోజు ఔరంగజేబ్ అప్రస్తుతమా? ఆయన సమాధిని తొలగించాల్సిన అవసరం ఉన్నదా? అని మీడియా ప్రశ్నించగా.. ‘అది అప్రస్తుతమని నేను అనుకుంటున్నాను’ అని సమాధానం చెప్పారు. కానీ.. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.