RSS chief Mohan Bhagwat | భారతీయ జంట ముగ్గురిని కనాలి.. ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

75 ఏళ్లు రాగానే రిటైర్‌ అవ్వాలని తాను ఎవరికీ సలహా ఇవ్వలేదని, అదే సమయంలో 75 ఏళ్లు రాగానే ఎవరైనా రిటైర్‌ అవ్వాలని గానీ తాను అనలేదని మోహన్‌ భాగవత్‌ అన్నారు. గతంలో ఈ విషయంలో మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించినవేననే అభిప్రాయాలు బలంగా వెలువడ్డాయి.

  • By: TAAZ |    national |    Published on : Aug 29, 2025 12:54 AM IST
RSS chief Mohan Bhagwat | భారతీయ జంట ముగ్గురిని కనాలి.. ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

RSS chief Mohan Bhagwat |  దేశ జనాభా విషయంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మార్పులకు గురైతే దేశం చీలిపోతుందని చెప్పారు. జనాభా పెరుగుదల కంటే అందులో ఉద్దేశం అత్యంత కీలకమైనదని భాగవత్‌ చెప్పారు. మతం అందులో ఒక ఛాయిస్‌ అన్నారు. మతాన్ని దురాశల కోసం వాడుకోకూడదని హితవు పలికారు. దీన్ని అపాలన్నారు. అదే సమయంలో భారతీయులంతా కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని సూచించారు. అప్పుడే తగినంత జనాభా ఉండటమే కాకుండా నియంత్రణలో ఉంటుందని అన్నారు. ఆరెస్సెస్‌ శతవర్ష వేడులకల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన మూడు రోజుల సమావేశం ముగింపురోజైన గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ జనాభా పాలసీ 2.1 పిల్లలను సిఫారసు చేస్తున్నదన్న భాగవత్‌.. 2.1 అంటే ఒక జంటకు ముగ్గురు పిల్లలు అని అభివర్ణించారు. ప్రతి భారతీయుడు ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని చెప్పారు. దీనిని తాను దేశం కోణంలో సూచిస్తున్నానన్నారు. జనాభాలో అసమతుల్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణలో ఉంచడంతోపాటు.. తగినంత జనాభా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అందుకోసమే ముగ్గురు పిల్లలు అవసరమని అన్నారు. ‘ప్రతి కమ్యూనిటీలో జనాభా పెరుగుతున్నది. హిందువుల్లో అది తగ్గిపోతున్నది. ఇప్పుడు మరీ తగ్గిపోతున్నది. ఇతర మతాల్లో తగ్గుదల అంత గణనీయంగా లేదు. అయినా వారి జనాభా కూడా తగ్గిపోతున్నది’ అని చెప్పారు. జనాభా నెమ్మదించిన సమాజాలు క్రమంగా అంతరించిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారని భాగవత్‌ తెలిపారు. ముగ్గురుకంటే ఎక్కువ పిల్లలను కనని సమాజాల్లో ఇది కనిపిస్తున్నదని వివరించారు. సరై వయసులో పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లలను కంటే తల్లిదండ్రులు, పిల్లలు కూడా బాగుంటారని తెలిపారు. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వారు మంచి నడవడికను అలవర్చుకుంటారని అన్నారు. వారి కుటుంబ జీవితంలో భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలూ ఉండబోవన్నారు.

బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో తమకు ఎటువంటి వైరం లేదని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. బీజేపీ తరపున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందనేది నిజం కాదని తెలిపారు. అనేక వర్గాలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఒక్క బీజేపీ ప్రభుత్వాలే కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘కేంద్రం, రాష్ట్రాలతో మాకు మంచి సమన్వయం ఉంది. అంతర్గత వైరుధ్యాలు ఉన్నా ఏ విధంగానూ ఎటువంటి వైరం లేదు. బీజేపీతో పోరాటం ఉండవచ్చు కానీ గొడవ కాదు. మనం రాజీ గురించి మాట్లాడినప్పుడు, పోరాటం తీవ్రమవుతుంది’ అని భాగవత్‌ అన్నారు. కొన్ని విషయాలలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమిష్టి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. నిర్ణయాలు తీసుకోవడం విషయానికొస్తే, ఆర్‌ఎస్‌ఎస్‌తో బీజేపీ ఏకీభవించకపోయినా, ఆర్‌ఎస్‌ఎస్ తన సభ్యులను విశ్వసిస్తుందని, ఏదో ఒక సమయంలో వారు కలిసిపోతారని పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ సూచనలను మాత్రమే అందిస్తుంది కానీ.. బీజేపీ తీసుకునే నిర్ణయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోదని మోహన్ భాగవత్ వెల్లడించారు. ‘నేను 50 సంవత్సరాలుగా శాఖను నిర్వహిస్తున్నాను. ఎవరైనా నాకు సూచన ఇస్తే వింటాను. బీజేపీ దేశాన్ని నడుపుతోంది. వారు అందులో నిపుణులు. ఆర్‌ఎస్‌ఎస్ కాదు’ అని ఆయన అన్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం పదవీకాలం ముగిసిన పార్టీ చీఫ్ జెపీ నడ్డా వారసుడిని ప్రకటించడంలో బీజేపీ ఆలస్యం వహించిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విమర్శించారు.

రిటైర్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు

75 ఏళ్లు రాగానే రిటైర్‌ అవ్వాలని తాను ఎవరికీ సలహా ఇవ్వలేదని, అదే సమయంలో 75 ఏళ్లు రాగానే ఎవరైనా రిటైర్‌ అవ్వాలని గానీ తాను అనలేదని మోహన్‌ భాగవత్‌ అన్నారు. గతంలో ఈ విషయంలో మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించినవేననే అభిప్రాయాలు బలంగా వెలువడ్డాయి. ఇప్పుడు తాను అలా అనలేదని తేల్చి చెప్పారు. 75ఏళ్లు వచ్చిన నాయకులు రిటైర్‌ అవ్వాలా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘నేను రిటైర్‌ అవుతానని కానీ, ఎవరినన్నా రిటైర్‌ అవమని కానీ నేను ఎప్పుడూ చెప్పలేదు. సంఘ్‌లో మనకు ఇష్టం ఉన్నా లేక పోయినా మాకొక పని చెబుతారు. నాకు 80 ఏళ్లు ఉండి.. నన్ను ఒక శాఖను నిర్వహించని సంఘ్‌ చెబితే.. నేను ఆ పని చేయాల్సిందే. సంఘ్‌ ఏం పని చెప్పినా మేం చేస్తాం. సంఘ్‌ కోరినంత కాలం పనిచేస్తాం. సంఘ్‌ కోరితే రిటైర్‌ అవుతాం’ అని ఆయన అన్నారు.