నాడు కాలుష్య రిఫైనరీ.. నేడు ప్రపంచ స్థాయి మామిడి పండ్ల ఎగుమతి కేంద్రం!

కాలుష్య రిఫైనరీగా విమర్శలు ఎదుర్కొన్న జామ్‌నగర్ ప్రాజెక్ట్ నేడు ప్రపంచ స్థాయి మామిడి ఎగుమతి కేంద్రంగా మారి రిలయన్స్‌కు భారీ ఆదాయం తెస్తోంది.

నాడు కాలుష్య రిఫైనరీ.. నేడు ప్రపంచ స్థాయి మామిడి పండ్ల ఎగుమతి కేంద్రం!

విధాత : కాలుష్యాన్ని వెదజల్లుతుందంటూ విమర్శల పాలైన ఓ రిఫైనరీ కంపెనీ నేడు రూ.600 టన్నుల మామిడి పండ్ల దిగుమతితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతి కేంద్రంగా ఆవిర్భవించిన సక్సెస్ స్టోరీ వైరల్ గా మారింది. కాలుష్య కారక రిఫైనరీని మూసివేద్దామా ? అన్న ప్రశ్న నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మామిడి పండ్ల ఎగుమతి ద్వారా ప్రతి ఏటా 600 ఎకరాల మామిడి తోట నుండి వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు..? అన్న ప్రశ్న వరకు సాగిన విజయ ప్రస్థానం సర్వత్రా ఆసక్తి రేపుతుంది. సమస్య పరిష్కారంలో వ్యవహరించిన ప్రత్యామ్నాయ మార్గాలు..వినూత్న ఆలోచనలు విజయానికి బాటలు వేసిన కథకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు గుజరాత్ లోని జామ్ నగర్ ప్రాంతం రిలయన్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ హబ్‌కు మాత్రమే నిలయం కాదు.. పరిశ్రమ, ప్రకృతి, నివాస స్థలాలు విలాసవంతమైన ఆతిథ్యాన్ని మేళవించే ఒక విస్తారమైన జీవావరణ వ్యవస్థగా కొనసాగుతు ఆకట్టుకుంటుంది.

సరికొత్త సక్సెస్ అందించిన వినూత్న ఆలోచన

1997లో జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ వల్ల భారీగా కాలుష్యం ఏర్పడింది. దీనిపై గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి పదేపదే నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో కంపెనీ ముందు ఒక పెద్ద ప్రశ్న నిలిచింది. పర్యావరణాన్ని కాపాడేందుకు రిఫైనరీ మూసివేయాలా? లేక కార్యకలాపాలను కొనసాగించాలా? అన్న సందిగ్ధం ఎదురైంది. ఈ సంక్లిష్ట సమయంలో ముఖేష్ అంబానీ ఒక సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నారు. రిఫైనరీ చుట్టూ ఉన్న నిస్సారమైన, సముద్రపు ఉప్పు నీటి భూమిలో మామిడి చెట్లను నాటాలని నిర్ణయించారు. ఇది ఒక క్లిష్టమైన ప్రయత్నం అయినప్పటికీ, ఆ భూమిని మార్చడానికి రిలయన్స్ గట్టి ప్రయత్నాలే చేసింది.

సముద్రపు నీటితో మామిడి తోట సాగు

ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రాయీ అని పిలువబడే విశాలమైన మామిడి తోట ఏర్పాటుకు నీరందించడానికి, రిలయన్స్ సంస్థ సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ఒక పెద్ద డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. వారు మామిడి తోట సాగులో డీశాలినేషన్ (నీటిలోని ఉప్పును తొలగించడం), డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్ధతులను ఉపయోగించారు. దీనికి 7-8 ఏళ్లు పట్టింది. చివరకు వారి కృషి ఫలించింది. ఇప్పుడు 600 ఎకరాలలో విస్తరించి ఉన్న పచ్చని మామిడి తోటగా ఆవిర్బవించింది. ఇందులో ఆల్ఫోన్సో నుండి అమెరికాకు చెందిన టామీ అట్కిన్స్ వరకు 200 పైగా రకాలతో కూడిన 1.50 లక్షల మామిడి చెట్లు ఉన్నాయి. ఆసియాలో ఎక్కడైనా ఒక పారిశ్రామిక సముదాయానికి అనుసంధానించబడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ ప్రాజెక్టులలో ఒకటిగా ఈ పండ్ల తోటను పరిగణిస్తున్నారు. ఇందులో మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే, ఈ మామిడి పండ్ల విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడుతుంది కాబట్టి దీనిపై ఎటువంటి పన్ను (Tax Free) ఉండదు.

ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతి కేంద్రం

“ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రయీ” మామిడి తోట ప్రతి ఏటా 600 టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఒక రిఫైనరీ నుండి ప్రపంచ స్థాయి పండ్ల ఎగుమతి కేంద్రంగా మారి, ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా నిలిచింది. అంతేకాదు..కేవలం పండ్ల దిగుబడికే పరిమితం కాకుండా.. రిలయన్స్ ప్రతి సంవత్సరం స్థానిక రైతులకు లక్ష ఉచిత మొక్కలను పంపిణీ చేస్తూ, ఆధునిక వ్యవసాయంలో శిక్షణ ఇస్తూ వారికి సహాయం చేస్తోంది.
ఈ రైతుల నుండి ప్రొక్యూర్ చేసుకున్న పండ్లను కూడా కలుపుకుని… మామిడి పండ్ల ఎగుమతులు ద్వారా సాలీనా రూ.11,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు కాలుష్యంతో నిండిన పారిశ్రామిక ప్రాంతం నేడు పచ్చని విజయగాథగా మారింది. ముఖేష్ అంబానీ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని, అటు పర్యావరణానికి, ఇటు వ్యాపారానికి, సమాజానికి ప్రయోజనాలు అందించడం విశేషం.

ప్రపంచ స్థాయి కేంద్రంగా జామ్ నగర్ రిఫైనరీ

ముఖేష్ అంబానీ జామ్‌నగర్ ఎస్టేట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ చుట్టూ విస్తరించి ఉంది. ఇందులో 1,50,000 చెట్లతో కూడిన 600 ఎకరాల మామిడి తోట, 3,000 ఎకరాల వంతారా వన్యప్రాణుల రక్షణ కేంద్రం, 750 ఎకరాల రిలయన్స్ గ్రీన్స్ టౌన్‌షిప్, ప్రపంచవ్యాప్త అతిథుల కోసం విలాసవంతమైన గ్రీన్ రిట్రీట్ విల్లాలు ఉన్నాయి. ఇందులో నివాసాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద సౌకర్యాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

నకిలీఉద్యోగం.. 67 పెళ్లిళ్లతో ఘరానా మోసం
ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ క్యాంపెయిన్ !