పాపం.. పుచ్చకాయ అమాయకురాలు.. ముంబై కుటుంబాన్ని చంపింది విష ప్రయోగం?

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో కీలక మలుపు. మరణాలు పుచ్చకాయ వల్ల కాదని, విషప్రయోగం జరిగి ఉండొచ్చని ఫోరెన్సిక్ సంకేతాలు. పూర్తి నివేదిక కోసం ఎదురుచూపులు.

mumbai family deaths crying watermelon illustration symbolic poison investigation india

ముంబై ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యుల ఫోటోతో పాటు, విషప్రయోగం అనుమానాల మధ్య ‘ఏడుస్తున్న పుచ్చకాయ’ ప్రతీకాత్మక చిత్రం

Not Watermelon, But Poison? Twist in Mumbai Family Death Case

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ ఘటనకు కారణం పుచ్చకాయ అని ప్రచారం జరిగినా… ఇప్పుడు ఆ వాదన సందేహాస్పదంగా మారింది. ప్రాథమిక ఫోరెన్సిక్ సంకేతాలు చూస్తే ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కాదని, విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అబ్దుల్లా డోకాడియా (45), అతని భార్య నస్రీన్ (35), కుమార్తెలు అయేషా (16), జైనబ్ (13) గత వారం రాత్రి తమ ఇంట్లో బంధువులతో కలిసి. మటన్ బిర్యానీ తిన్నారు. అయితే బంధువులు వెళ్లిపోయిన తరువాత రాత్రి 1 గంటల సమయంలో కుటుంబ సభ్యులందరూ పుచ్చకాయ తిన్నారని సమాచారం. ఉదయం 5 గంటలకే నలుగురికి తీవ్ర వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలించినప్పటికీ గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. కానీ, అదే భోజనం చేసిన అతిథులకు ఎలాంటి సమస్యలు రాలేదు. దాంతో అందరి అనుమానం పుచ్చకాయ మీదకు మళ్లింది.

ఫోరెన్సిక్ పరిశోధనవిషప్రయోగ చిహ్నాలు?

ఈ కేసులో కీలక మలుపు తీసుకువచ్చింది ప్రాథమిక ఫోరెన్సిక్ పరిశీలన. మృతదేహాల లోపలి అవయవాలు — మెదడు, గుండె, పేగులు — ఆకుపచ్చ రంగులోకి మారినట్టు సమాచారం. ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్‌ వల్ల కాక, విషం సేవిస్తే కనిపించే లక్షణమని వైద్యులు చెబుతున్నారు.

ఇంకా షాకింగ్ అంశం ఏమిటంటే… అబ్దుల్లా డోకాడియా శరీరంలో మార్ఫిన్ అనే శక్తివంతమైన నొప్పి నివారణ ఔషధం గుర్తించబడింది. ఇది సాధారణంగా నియంత్రిత వైద్య వినియోగంలో మాత్రమే ఉపయోగిస్తారు. అధిక మోతాదులో స్వీకరిస్తే మరణం సంభవిస్తుంది. అది ఎలా శరీరంలోకి వెళ్లింది? ప్రమాదవశాత్తా? లేక ఉద్దేశపూర్వకమా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారుల సమాచారం ప్రకారం, మరణాలకు, పుచ్చకాయతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. తుది నివేదిక వచ్చేవరకు ఏ నిర్ణయానికి రావద్దని సూచించారు.

ముంబై కుటుంబం తిన్న బిర్యానీ, పుచ్చకాయ ఆహారం — మరణాల తర్వాత దర్యాప్తులో ఉన్న అంశాలు

మలుపు తీసుకున్న దర్యాప్తు

ఈ కేసు సాధారణ విషాహార ప్రమాదమా.. లేక పక్కాగా ప్లాన్ చేసిన విషప్రయోగమా? హత్యలా? ఆత్మహత్యలా? అన్నది తుది నివేదికలు  వెలువడితేనే స్పష్టమవుతుంది. పోలీసుల దర్యాప్తు కూడా అదే దిశలో సాగనుంది.

భయం దెబ్బకు.. పాపం.. పుచ్చకాయ బలైంది

ఈ ఘటన ప్రభావం నేరుగా పుచ్చకాయ మార్కెట్‌పై పడింది. నవి ముంబై APMC మార్కెట్‌లో పుచ్చకాయలకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది.

ఒక ఘటనతో పుచ్చకాయపై భయాలు పెరగడం వల్ల వేసవి సీజన్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ఈ పండుకే ఇప్పుడు డిమాండ్ తగ్గిపోవడం గమనార్హం. ఎంతో ఆరోగ్యకరమైన పుచ్చకాయ ఈ అపనింద వల్ల చెడ్డపేరు మోయాల్సివచ్చింది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ముంబై కుటుంబ మరణాలు ఒక సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కేసు కాదనే అనుమానం రోజు రోజుకీ బలపడుతోంది. పుచ్చకాయపై వచ్చిన నింద తాత్కాలికమే కావచ్చు. అసలు నిజం బయటపడాలంటే ఫోరెన్సిక్ తుది నివేదిక కోసం వేచి చూడాల్సిందే.

Latest News