రాజస్థాన్ ఎన్నికలకు పెళ్లిళ్ల తంటా.. పోలింగ్ రోజు 50వేలకు పైగా వివాహాలు!

- పెళ్లిళ్ల కోసం ఊళ్లకు వెళ్లనున్న ఓటర్లు
- పెళ్లి పనుల్లో వివిధ రంగాల నిమగ్నం
- ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
- కలవరపడుతున్న పార్టీల అభ్యర్థులు
జైపూర్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిదన్న సామెత.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. రాజస్థాన్‌లో పోలింగ్ రోజున వేల పెళ్లిళ్లు ఉన్నాయి. ప్రతి ఓటూ కీలకమైన సమయంలో ఓటింగ్ రోజున జరిగే పెళ్లిళ్లు అన్ని పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వందా కాదు.. వెయ్యీ కాదు.. ఏకంగా 50వేలకు పైగా పెళ్లిళ్లు ఆ రోజు జరుగబోతున్నాయి. పోలింగ్ జరిగే నవంబర్ 23.. దేవ్ ఉథాని ఏకాదశి. రాజస్థానీలు ఆ రోజును ఎంతో పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు.
ఇది మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు కూడా జరుగుతుంటాయి. వేల సంఖ్యలో జరిగే పెళ్లిళ్లు ఓటింగ్ శాతాలను గణనీయంగా తగ్గించే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్ గుప్తాను ప్రశ్నించగా.. ఈ అంశాన్ని పలు రాజకీయ పార్టీలు సమావేశంలో లేవనెత్తాయని, అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కూడా ఉన్నదని తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని కోరారని, అదే విషయాన్ని కమిషన్‌కు తెలిపామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 51,756 పోలింగ్ కేంద్రాల్లో సగటున కనీసం 75శాతం ఓటింగ్ నమోదయ్యేలా ప్రజలను చైతన్యం చేసే పనిలో ఎన్నికల సంఘం ఉన్నది. అయితే.. ఎంత చేసినా పెళ్లిళ్ల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 74.71 శాతం ఓటింగ్ నమోదైంది.
రాజస్థానీలకు శుభప్రదమైన రోజు
‘దేవ్ ఉథాని ఏకాదశి పెళ్లిళ్లకు అత్యంత విశిష్టమైన సందర్భం. హిందువుల్లోని అన్ని కులాలవారూ ఆ రోజున పెళ్లిళ్లకు మొగ్గు చూపుతారు. ఈ ఏడాది దేవ్ ఉథాని ఏకాదశి రోజున 50వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉన్నది’ అని ఆలిండియా టెంట్ డెకొరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి జిందాల్ తెలిపారు.
సమస్త ఆర్థిక వ్యవస్థ నిమగ్నం
పెళ్లిళ్లంటే.. బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు. విశాలమైన హాళ్లు, ప్రత్యేకమైన పెళ్లిమందిరాల్లో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. వీటికి పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు ఒక ఎత్తయితే.. ఈ పెళ్లిళ్ల కోసం టెంట్లు, వంటవాళ్లు, సిబ్బంది, వంటలకు అవసరమైన కూరగాయలు, పప్పుదినుసులు తదితరాలు విక్రయించే దుకాణాలు.. ఇలా సకల ఆర్థిక వ్యవస్థ నిమగ్నం అవుతుంది. కొందరు కనీసం ఓటేయడానికి బయటకు వెళ్లే పరిస్థితులు కూడా ఉండవు.
ఇదే ఇప్పుడు అభ్యర్థులను కలవరానికి గురి చేస్తున్నది. ఉన్న ఊళ్లలో పెళ్లిళ్లకు హాజరయ్యేవారు కనీసం ఏదో ఒక సమయంలోనైనా వెళ్లి ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లకు వెళ్లేవారి ఓట్లపై అభ్యర్థులు ఆశలు వదులుకోవాల్సిందేనని ఈవెంట్ మేనేజర్లు అంటున్నారు. ‘దేవ్ ఉథాని ఏకాదశి రోజున జరిగే పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు ప్రజలు ఇతర నగరాలు, పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది.
అదే తరహాలో క్యాటరర్లు, ఎలక్ట్రీషియన్లు, పూల అలంకరణదారులు, బ్యాండ్ పార్టీలు.. ఇలా పెళ్లిళ్ల తంతులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములయ్యే వారు రోజంతా బిజీగా ఉంటారు. దీంతో వీరిలో చాలామంది ఓటింగ్‌కు వెళ్లే అవకాశాలు కూడా ఉండవు’ అని ఈవెంట్ మేనేజర్ మనీశ్‌కుమార్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పెళ్లిమండపాలు బుక్ అయిపోయాయని, వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఓటింగ్ రోజున జరుగనున్నాయని ఆయన తెలిపారు.
ఇబ్బందేమీ లేదంటున్న బీజేపీ
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సతీశ్ పూనియా మాత్రం పెళ్లిళ్ల ప్రభావం ఎన్నికలపై పెద్దగా చూపకపోవచ్చని అంటున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో తమ పార్టీ కార్యకర్తలు సఫలమవుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్నికలనే ప్రజాస్వామ్య పండుగని, బీజేపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున విశ్వాసం తొణికిసలాడుతున్నదని చెప్పారు. గతంలో ఉపాధి కోసం వలస వెళ్లినవారు పెళ్లిళ్ల కోసం పెద్ద సంఖ్యలో తిరిగి వస్తారని, ఇది పరిస్థితిని సమం చేస్తుందనేది ఆయన లాజిక్. ఆయన లాజిక్ ఎలా ఉన్నా.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పెళ్లిళ్లు షాక్ ఇవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.