Parliament Special Session | మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16,17,18తేదీలలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతుంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల పెంపు బిల్లు, మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లు ఆమోదం కోసం ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది.

parliament special session

విధాత: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16,17,18తేదీలలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతుంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల పెంపు బిల్లు, మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లు ఆమోదం కోసం ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. గురువారంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిపోనున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంటును నిరవధిక వాయిదా వేయకుండా వాయిదాతో సరిపెట్టి…ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది.

దేశ చరిత్రలో కీలక సమావేశాలు!

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపు విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ప్రధాన పార్టీలను కేంద్రం ఒప్పించాల్సి ఉంది. ప్రాంతీయ పార్టీల ఉనికి, కేంద్రంలో అధికారాన్ని చేపట్టే సమీకరణాలు 50శాతం సీట్ల పెంపుతో పూర్తిగా మారిపోనున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఈ అంశంపై గళమెత్తుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాల సీట్లు అవసరం లేని పరిస్థితి ఏర్పడి.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగనుందని..అలా జరుగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ రాష్ట్రాలు తమ సీట్ల సంఖ్య తగ్గుతుందేమోనని ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు, జనాభా భారీగా పెరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ వ్యత్యాసాన్ని ఎలా సవరించాలనే అంశంపై కేంద్రం ఒక ప్రత్యేక ఫార్ములా(50శాతం సీట్ల పెంపు)ను ఈ బిల్లులో ప్రతిపాదించనుందని సమాచారం. ఈ నెలలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైనవిగా నిలవనుండటం గమనార్హం.

మహిళా రిజర్వేషన్ల అమలు మరింత ముందుకు

వాస్తవానికి కులగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళా రిజర్వేషన్ల అమలు చేయాల్సి ఉంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటు ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’చట్టాన్ని 2023లో ఆమోదించింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళా రిజర్వేషన్ అమలు అని 2023 చట్టంలో ప్రస్తావించారు. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లు సెక్షన్ 5లో పేర్కొన్నారు. మారిన రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు తీసుకురావాలని కేంద్రం కసరత్తు చేస్తుంది. అయితే 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తింపజేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

డీలిమిటేషన్ చట్ట సవరణ కూడా..

అలాగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే డీలిమిటేషన్‌ చట్టాన్ని సవరిస్తూ మరో సాధారణ సవరణ బిల్లు కూడా ప్రవేశపెడతారు. వాటికి పార్లమెంటు ఆమోదం లభిస్తే అవి చట్ట రూపం పొంది 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి. ఫలితంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు వీలవుతుంది అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

లోక్ సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య 50శాతం పెంపు

లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గత వారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు పలు కాంగ్రెసేతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల మేరకు లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పెరగనుంది. వాటిలో 273 స్థానాలను మహిళలకు రిజర్వు చేయనున్నారు. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల సంఖ్యను 50 శాతం పెంచుతున్నందున వాటిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల సంఖ్య కూడా ఆ మేరకు పెరగనుంది. నియోజకవర్గాల పెంపుకు 2027 జనాభా లెక్కలను కాకుండా 2011 గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని మోదీ సర్కారు నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగనున్న సీట్లు..రిజర్వేషన్లు

నియోజక వర్గాల పెంపుతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతుంది. వాటిలో 12 నుంచి 13 సీట్లు మహిళలకు, రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనుంది. వాటిలో 86 నుంచి 87 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. వాటిలో 8 నుంచి 9 సీట్లు మహిళలకు రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయి. వాటిలో 59 స్థానాలను మహిళలకు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి :

Traffic Restrictions | ఇవాళ హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఆ రూట్ల‌లో అస‌లు వెళ్ల‌కండి..!
Mee Seva : తెలంగాణ మీసేవ కేంద్రాల సర్వీసు ధరల పెంపు

Latest News