తొలి హైడ్రోజన్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ హరియాణాలో ప్రారంభించారు. జింద్-సోనిపత్ మార్గంలో నడిచే ఈ రైలు పర్యావరణహిత రవాణాకు కొత్త దిశగా నిలవనుంది.

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.హరియాణాలోని జింద్‌ స్టేషన్‌లో ఈ హైడ్రోజన్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన ఈ రైలు.. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్‌లో 89 కిలోమీటర్లు ప్రయాణించనుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్‌లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 2600 మంది ప్రయాణించవచ్చు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్‌ రైలు సొంతంగా కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. దీని కోసం రైల్లో ‘ప్రొటాన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మెంబ్రేన్‌ ఫ్యూయెల్‌ సెల్‌’ అనే చిన్నపాటి పవర్‌ప్లాంట్‌ ఉంటుంది. ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3,200హెచ్ పీ. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తిమంతమైన హైడ్రోజన్‌ రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది.

హైడ్రోజన్ రైలు శుద్ధ ఇంధన పరిజ్ఞానంతో నడుస్తుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహనచర్య ఉండదు. హానికారక పొగ, కర్బనఉద్గారాలు వెలువడవు. ధ్వని కూడా తక్కువే.
రైల్లోని నాన్‌స్టాప్‌ వెంటిలేషన్‌ వ్యవస్థ.. గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి, పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే.. ఆటోమేటిక్‌ షట్‌ఆఫ్‌ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్‌ సరఫరాను నిలిపివేస్తుంది. ఈ రైల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. అవి హైడ్రోజన్‌ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకన్లలోనే అప్రమత్తం చేస్తాయి.

రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా హైడ్రోజన్ రైలు ప్రారంభం కీలక ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ స్టీమ్, డీజిల్, విద్యుత్‌ రైళ్లలో ప్రయాణించిన భారత వాసులు.. ఇకపై హైడ్రోజన్‌ రైళ్లలోనూ ప్రయాణించనున్నారు. త్వరలోనే కల్కా-శిమ్లా వంటి సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్‌లోనూ హైడ్రోజన్‌ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్‌ రైళ్లు ఇప్పడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి. తొలిసారిగా జర్మనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్‌ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడపడం, పరిమితంగా వినియోగంలోకి తీసుకురావడం చేస్తున్నాయి.

Latest News