విధాత, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తన తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హెచ్ఐసీసీ(HICC) ప్రాంగణంలో రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని హెచ్ఐసీసీకి వెళ్లి అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక..తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. రూ. 2,360 కోట్లతో జహీరాబాద్ ‘ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ’కి శంకుస్థాపన చేయడంతో పాటు, రూ. 3,180 కోట్లతో ఎన్ హెచ్-167 (గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్,హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగం) నాలుగు లేన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ. 1,250 కోట్లతో నిర్మించిన కాజీపేట, విజయవాడ మూడో రైల్వే లైన్ సెక్షన్‌ను జాతికి అంకితం చేస్తూనే, రూ. 300 కోట్లతో నిర్మించిన కాజీపేట ‘రైల్ అండర్ రైల్’ బైపాస్‌ను ప్రారంభించారు. టెక్స్‌టైల్ రంగం అభివృద్ధి కోసం రూ. 1,700 కోట్లతో పీఎం మిత్ర పార్క్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పనులను ప్రారంభించారు. రూ. 610 కోట్లతో మల్కాపూర్‌లో ఐఓసీఎల్ టెర్మినల్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించే మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.హైదరాబాద్‌లో అత్యాధునిక క్యాన్సర్ కేర్ మల్టీ-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు.
ప్రధాని తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లనున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెలుతారు. ప్రధాని మోదీ రాకతో బేగంపేట ఎయిర్‌పోర్ట్ సహా ఆయన పర్యటన ప్రాంతాలను, మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
