స్పెషల్ డే..సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ

సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్పెషల్ డే..సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ

భారత్ లోని ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయ పునర్ నిర్మాణం 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వహించిన అమృత్ మహోత్సవం ఆధ్యాత్మిక, భక్తిభావనలు, శివనామస్మరణల మధ్య సోమవారం వైభవంగా కొనసాగింది. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ పనులు జరిగి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ప్రభాస్ పటాన్ (వెరావల్) లోని అరేబియా సముద్ర తీరాన వెలసిన ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో సోమనాథుడు, సోమేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ప్రశాంత వాతావరణంలో సముద్రపు ఒడ్డున అలరారుతున్న సోమ్‌నాథ్‌ ఆలయానికి 1000ఏళ్ల చరిత్రాక నేపథ్యం ఉంది. సోమనాథ్ జ్యోతిర్లింగం శివుని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది (ఆది జ్యోతిర్లింగం). చంద్రుడు తన శాపవిమోచనం కోసం శివుడిని పూజించిన ప్రదేశంగా, అపారమైన చారిత్రక ప్రాముఖ్యత, పునర్నిర్మాణ శక్తికి చిహ్నంగా ఇది విరాజిల్లుతోంది.దీనిని “ప్రభాస తీర్థం” అని కూడా పిలుస్తారు.

పడిలేచిన కెరటాల ప్రతీక…సోమనాథ్ ఆలయ నిర్మాణ చరిత్ర

సోమనాథ్ ఆలయం చాళుక్య శైలిలో, అరేబియా సముద్రం ఒడ్డున 25 అడుగుల ఎత్తున భారీ శిలలపై ఎత్తైన శిఖరంతో మరు- గుర్జర శైలిలో అద్భుత శిల్పకళలతో నిర్మించబడింది. సముద్ర తీరాన అద్భుతమైన వాస్తు కళతో అలరారుతున్న ఆలయాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. సముద్రపు ఉప్పు గాలి వల్ల ఆలయం త్వరగా పాడవకుండా ఉండటానికి ప్రత్యేకమైన రాళ్లను వాడారు. ఈ విషయంలో ఆలయం సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలకు ఆదర్శనీయంగా నిలిచింది. ఆలయ సమీపంలో హిరణ్య, కపిల, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఉండటం విశేషం. వేయ్యేళ్ల కాలంలో విదేశీయుల దండయాత్రలకు గురైన ప్రతిసారి సోమనాథ్ ఆలయం పునర్మితమవుతూ వచ్చింది. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందినది. ఇది శిథిలమైపోగా తిరిగి క్రీ.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది.

17 దండయాత్రలతో ధ్వంసమైన సోమనాథ్ క్షేత్రం

చరిత్ర కాలక్రమంలో సోమనాథ్ జ్యోతిర్లింగం 17సార్లు ధ్వంసం అయినప్పటికిని తిరిగి జీర్ణోద్ధారణ పొందింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్, కె.ఎం. మున్షి తదితరులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆలయం 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో పునర్నిర్మించబడింది. పటేల్ మరణాంతరం మే 11, 1951న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునర్ నిర్మితమైన సోమనాథ్ ఆలయం ప్రారంభించబడింది.

పునరుజ్జీవ శక్తి కేంద్రంగా సోమనాథ్ క్షేత్రం

ఎన్నిసార్లు కూల్చినా తిరిగి లేవగలం అనే భారతీయ సంస్కృతికి సోమనాథ్ ఆలయాన్ని ప్రతీకగా భావిస్తున్నారు. అందుకే దీన్ని అక్షయ పాత్ర వంటి నిర్మాణంగా చెబుతారు. ఎన్నిసార్లు ధ్వంసం చేసినా కూడా.. మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకున్న ఈ ఆలయం, భారతీయ ధర్మంలోని అజేయ శక్తికి మొదటి చిహ్నంగా భావిస్తారు. సోమనాథ్ 75 ఏళ్ల పండుగ అనేది ఒక ఆలయ వేడుక మాత్రమే కాదు అని, ఇది ఒక జాతి తన అస్తిత్వాన్ని చాటుకున్న సందర్భంగానూ భావిస్తున్నారు. భారత పునర్నిర్మాణ ప్రయాణంలో ఒక మైలురాయిగానూ చూస్తున్నారు. భౌగోళికంగా దక్షిణ ధ్రువానికి నేరుగా ఉన్న గేట్ వేగా సోమనాథ్ ఆలయాన్ని పరిగణిస్తారు. ఖగోళపరంగా చూస్తే చంద్రుని గమనాన్ని, కాలగణనను సూచించే కేంద్రంగానూ చెబుతారు. ఇంజనీరింగ్ పరంగా సముద్రపు అలల దాడులను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే అద్భుత నిర్మాణంగా వర్ణిస్తారు. సముద్రపు హోరు, చంద్రుని వెన్నెల, శివుని ధ్యానం – ఈ మూడింటి కలయికే సోమనాథ్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రహస్య ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిందని కథనం.

ఇవి కూడా చదవండి :

దేశ ప్రజలకు మోదీ సూచనల్లో మతలబు ఏమిటీ ?
పీఎం కిసాన్ 23వ విడత నిధులు అప్పుడే..?