మాది బంధుప్రీతి కాదు.. దేశం ప‌ట్ల భ‌క్తి భావ‌న‌: బీజేపీ విమ‌ర్శ‌ల‌పై ప్రియాంక‌

మాది బంధుప్రీతి కాదు.. దేశం ప‌ట్ల భ‌క్తి భావ‌న‌: బీజేపీ విమ‌ర్శ‌ల‌పై ప్రియాంక‌

బిలాస్‌పూర్ : ప‌దేప‌దే కాంగ్రెస్‌వి కుటుంబ రాజ‌కీయాలంటూ విమ‌ర్శ‌లు చేస్తున్న బీజేపీపై కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక‌గాంధీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ‘మేం మా పూర్వీకుల గురించి మాట్లాడితే మ‌మ్మ‌ల్ని విమ‌ర్శించేవారు కుటుంబ రాజ‌కీయాల గురించి మాట్లాడుతారు. ఇది కుటుంబ రాజ‌కీయ‌మో, బంధు ప్రీతో కాదు.. ఇది దేశం ప‌ట్ల భ‌క్తిభావ‌న‌. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేదు’ అని ఆమె అన్నారు.


ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్‌పూర్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆమె మాట్లాడుతూ.. త‌న నాన‌మ్మ ఇందిరాగాంధీ, త‌న తండ్రి రాజీవ్‌గాంధీల‌ను ప్ర‌స్తావిస్తూ.. త‌మ కుటుంబం చేసిన త్యాగాల గురించి ప్ర‌స్తావించారు. అంత‌టి భ‌యంక‌ర‌మైన ఘ‌టన త‌మ‌ జీవితంలో జ‌రిగిన‌ప్ప‌టికీ.. తాము ఈ దేశం ప‌ట్ల ఉన్న విశ్వాసాన్ని కొంచెమైనా కోల్పోలేద‌ని, త‌మ నాన‌మ్మ ఇందిరాగాంధీ అంత‌టి దేశ‌భ‌క్తి భావ‌న‌ను త‌మ హృద‌యాల్లో నింపార‌ని చెప్పారు. ‘ఆమె చ‌నిపోయిన ఏడేళ్ల త‌ర్వాత నాకు 19 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఇలాంటిదే మ‌రో ఘ‌ట‌న నా తండ్రికి జ‌రిగింది.


అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ దేశం ప‌ట్ల నా విశ్వాసం కొంచెమైనా స‌డ‌ల‌లేదు’ అని ప్రియాంక తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ఆమె మండిప‌డుతూ.. గ‌త ప‌ద్దెనిమిదేళ్ల‌లో ఏనాడూ మ‌హిళ‌ల‌కు సాయం చేయాల‌న్న ఆలోచ‌నే ఆ ప్ర‌భుత్వానికి రాలేద‌ని అన్నారు. ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో మ‌హిళ‌ల ఓట్లు కొల్ల‌గొట్టేందుకు స్కీముల పేరుతో వ‌స్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇదిలా ఉంటే.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 500కే సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్తు స‌హా 8 హామీలు ప్ర‌క‌టించింది. తాము అధికారంలోకి రాగానే అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.