విధాత : ఎంపీ రాఘవ్ చద్దా..ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ యువ సంచలనం. పార్లమెంటులో సామాన్య, మద్య తరగతి ప్రజల గొంతుకై వారి సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపయి.. దేశ రాజకీయాలలో కొద్ది కాలంలోనే అందరి గుర్తింపు పొందారు. కార్పోరేట్ దిగ్గజాల నుంచి సామాన్యుల వరకు అంతా ఆయన లేవనెత్తే అంశాలపై ఆసక్తి చూపుతుంటారు. అంతటి ప్రజాదరణతో దూసుకెలుతున్న నేతను అవినీతికి వ్యతిరేకంగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా రాజ్యసభ పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించడం సంచలనం రేపింది. తన తొలగింపుపై ఆప్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ..రాఘవ్ చద్దా విడుదల చేసిన వీడియో సైతం ఇప్పుడు అంతే వైరల్ గా మారింది.
గొంతు నొక్కితే..గెలిచినట్లుగా కాదు : ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్ చద్దా సందేశం
పార్లమెంట్‌లో నాకు ఎప్పుడు మాట్లాడే అవకాశం లభించినా.. ప్రజా సమస్యలనే లేవనెత్తుతానని.. బహుశా నేను ప్రస్తావించే అంశాలను సభలో సాధారణంగా చర్చించరేమోనని.. కానీ ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ఏమైనా నేరమా? నేనేమైనా తప్పు చేశానా? అని ఆప్ నాయకత్వాన్ని రాఘవ చద్దా ప్రశ్నించారు. పార్లమెంట్‌లో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని మా పార్టీ స్వయంగా రాజ్యసభ సెక్రటరీకి చెప్పడం విస్మయం కల్గించిందన్నారు. అందుకే పార్టీ నాయకత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నానని.. నన్ను మాట్లాడకుండా ఎవరైనా ఎందుకు ఆపాలనుకుంటారు? నేను మాట్లాడినప్పుడు ప్రజా సమస్యల గురించి, సామాన్యుడి గురించి మాట్లాడతాను అని రాఘవ్ చద్దా చెప్పుకొచ్చారు.
ప్రజల పక్షాన నిలబడటం తప్పా..?
“పార్లమెంట్‌లో నాకు లభించిన ప్రతి అవకాశాన్ని ప్రజా సమస్యల కోసమే వినియోగించానని చద్దా పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరల బాదుడు, గిగ్ వర్కర్ల ఇబ్బందులు,టెలికాం కంపెనీల రీఛార్జ్ విధానాల మోసాలు, టోల్ ప్లాజా దోపిడీ, బ్యాంకు ఛార్జీల దోపిడీ వంటి అంశాలపై గళమెత్తానని.. ఇవన్నీ పార్టీకి మైలేజీ ఇచ్చేవే కదా! అని గుర్తు చేశారు. టెలికాం కంపెనీలు 12 నెలల్లో 13 సార్లు రీఛార్జ్ చేయించడం.. డేటా రోల్‌ఓవర్ ఇవ్వకపోవడం, రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేయడం వంటి సమస్యలన్నింటినీ నేను సభలో ప్రస్తావించానని.. అది ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రయోజనం కదా, దీనివల్ల పార్టీకి ఏం నష్టం జరుగుతోంది? ఎందుకు నన్ను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో నా గళాన్ని మీరు అణచివేయగలరేమో..కాని నన్ను ఓడించలేరని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడటం ఏమైనా నేరమా? నేనేం తప్పు చేశాను?” అని చద్దా భావోద్వేగానికి లోనయ్యారు.
నేను నదిలాంటి వాడిని…వరదలా విరుచుకపడుతా !
ప్రజా సమస్యలపై గళమెత్తడమే తన తప్పా అని ప్రశ్నించారు. నా గొంతు నొక్కేస్తే విజయం సాధించినట్లు కాదు అని స్పష్టం చేశారు. నన్ను పదవుల నుంచి తొలగించి నా గళాన్ని అణచివేయగలరేమో కానీ, నన్ను ఓడించలేరన్నారు. నేను నది లాంటి వాడిని.. సమయం వచ్చినప్పుడు వరదలా విరుచుకుపడతాను” అంటూ ఆప్ నాయకత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా మౌనాన్ని ఓటమిగా పొరపాటు పడకండి. నన్ను మౌనంగా ఉంచారు. కానీ నేను ఓడిపోలేదు అని, ప్రజలు నా పక్షాన ఉన్నారని.. వారి కోసం నా పోరాటం ఆపబోనని స్పష్టం చేశారు.
రాజ్యసభలో ఆప్ ఉపనేతగా చద్దా స్థానంలో ఆశోక్ మిత్తల్
రాజ్యసభ లో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చద్దాను తొలగించిన ఆప్ నాయకత్వం. ఆ హోదాలో మరో ఎంపీ అశోక్ మిత్తల్‌ను నియమించింది. ఆప్ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు చడ్డా దూరంగా ఉంటుండటం, పార్టీ కార్యక్రమాలపై స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మోదీ భయంతో సమోసా ప్రశ్నలు
రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు పై ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ అనురాగ్ ధండా, పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. దేశ సమస్యలపైన, సర్ వంటి ప్రధాన అంశాలపైన కాకుండా ప్రధాని మోదీకి భయపడి.. సమోసాల ధర గురించి చద్దా మాట్లాడటం ఏమిటంటూ? మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరైతే భయపడతారో.. వారు దేశం కోసం ఎలా పోరాడతారు?’ అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఒక పార్టీకి మాట్లాడటానికి లభించే పరిమిత సమయాన్ని దేశాన్ని కాపాడటానికి ఉపయోగించుకోవాలి తప్ప.. విమానాశ్రయాల్లో క్యాంటీన్లలో సమోసాల ధరను తగ్గించడం వంటి సమస్యల కోసం కాదని వ్యంగ్యంగా విమర్శించారు.
Silenced, not defeated
My message to the ‘aam aadmi’
—
खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ‘आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3
— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026
ఇవి కూడా చదవండి :
కల్తీ మామిడి పండ్లు వస్తున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త!
యుద్దం ఎఫెక్ట్.. నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ !
