డీలిమిటేషన్..మహిళా రిజర్వేషన్లపై కేంద్రం లైన్ క్లియర్!
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధం. లోక్‌సభ స్థానాల పెంపుపై రాజకీయంగా చర్చలు వేడెక్కుతున్నాయి.
విధాత : డీలిమిటేషన్(నియోజవర్గాల పునర్విభజన), 33శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంపై కేంద్రం ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ నెల 16నుంచి 18వరకు జరగబోతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బిల్లుల ఆమోదానికి మద్దతునివ్వాలని ఇప్పటికే ప్రధాని మోదీ అన్ని పార్టీలకు లేఖలు రాశారు. ఉభయ సభల్లో ఉన్న సంఖ్యా బలంతో బిల్లుల ఆమోదం జరిపించి తీరాలని కేంద్రం పట్టుదలగా ఉంది. డీలిమిటేషన్ పై పార్లమెంటులో ఈ నెల 16న చర్చించనున్నారు. తర్వాతా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చిస్తారు. ‘నారీ శక్తి వందనం అధినియమ్’ బిల్లులో సవరణలు చేపట్టి… 2029 లోక్‌సభ ఎన్నికల సమయానికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి తీసుకరావాలని కేంద్రం నిర్ణయించింది.
ఎంపీలకు అజెండా ప్రతులు
ఈ నెల 16న రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లుగా..వాటి గురించి అధికారిక అజెండాను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. వాటికి సంబంధించిన ప్రతులను వారికి పంపింది. లోక్‌సభలో డీలిమిటేషన్ సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుచేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం మహిళలకు 33శాతం సీట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సీట్లు కూడా పెరుగుతాయని సమాచారం. కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై అధికారిక సమాచారం అందించడంతో రేపు ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా కూటమి వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
543నుంచి 850కి లోక్ సభ స్థానాలు
లోక్ సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 స్థానాల నుంచి 850కి పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలలో 815స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 ఎంపీ స్థానాలు పెంచనున్నారు. ఇందుకోసం డీలిమిటేషన్ చట్టం సవరణకు వీలుగా 131వ రాజ్యాంగ సవరణతో పాటు ఆర్టికల్ 55, 81 సవరణకు కేంద్రం సిద్దమైంది. ఈ మేరకు సర్క్యూలర్ సైతం జారీ చేసింది. అయితే రాష్ట్రాల అమోదం తీసుకోకుండా…ప్రధాన పార్టీల అంగీకారం లేకుండా, పూర్తి జనాభా లెక్కల సేకరణ చేయకుండా హడావుడిగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం తేవడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ముఖ్యంగా 50శాతం సీట్ల పెంపు ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు సీఎంలు రేవంత్ రెడ్డి, స్టాలిన్ లు ఏకంగా ప్రజాందోళనలు నిర్వహిస్తామని ప్రకటించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా వివాదస్పదంగా మారింది. అయితే కేంద్రం మాత్రం 50శాతం సీట్ల పెంపు విధానంతో అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని భావిస్తుంది. ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇవి కూడా చదవండి :
అమెరికా-ఇరాన్ మధ్య తదుపరి చర్చలు జెనీవాలో..!?
బావిలో పడిన సింహం…రెస్క్యూ ఆపరేషన్ వైరల్ !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram