విద్యార్ధులపై పోలీసుల దమనకాండ: రాహుల్ గాంధీ

నీట్ పేపర్ లీక్ నిరసనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను రాహుల్ గాంధీ ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులకు పరిహారం, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ విద్యార్ధులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన సందర్భంగా పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్ధులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ కు దిగారని ఆరోపించారు. మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లాఠీచార్జ్ సంబంధించిన వీడియోలను విడుదల చేసి మాట్లాడారు. ప్రశాంతంగా నిరసన నిర్వహిస్తున్న విద్యార్ధులను పోలీసులు రెచ్చగొట్టి హింసాత్మక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. విద్యార్థులు ఎలాంటి నేరాలకు పాల్పడలేదని..శాంతియుతంగా ప్రజాస్వామికంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని రాహుల్ మండిపడ్డారు.

ఏన్డీఏ పదేళ్ల పాలనలో 152 పేపర్ లీకేజీలు

ఎన్డీఏ పదేళ్ల పాలనలో 152పేపర్ల లీకేజీలు జరిగాయని, దీంతో 7.5కోట్ల మంది కుటుంబాలు నష్టపోయాయని, దేశంలో సరైన విద్యావ్యవస్థ లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యపై కేంద్ర బడ్జెట్ 1.4లక్షల కోట్లుగా ఉందని, పేరెంట్స్ నీట్ కోసం 1.32లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని రాహుల్ గాంధీ వివరించారు. కేంద్రం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని, విద్యార్ధులకు భవిష్యత్తు లేకుండా చేస్తుందని, ఉద్యోగ పరీక్షల పేపర్లు కూడా లీకేజ్ అవుతున్నాయని విమర్శించారు. మద్య తరగతి, పేద విద్యార్ధుల కుటుంబాలు వారి పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకున్నారని, పేపర్ల లీకేజీలతో వారికి విద్యా వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మోదీ ప్రభుత్వం క్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేట్, కార్పోరేట్ రంగాలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు.

కేంద్రం ముందు మూడు డిమాండ్లు

రాహుల్ గాంధీ కేంద్రం ముందు మూడు ప్రధాన డిమాండ్లను పెట్టారు. ఈ డిమాండ్లు విద్యార్ధుల డిమాండ్లుగా పేర్కొన్నారు. వాటిలో ముందుగా విద్యా మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజీలతో నష్టపోయిన విద్యార్ధులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విద్యార్ధులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ధర్మేంద్ర రాజీనామా తర్వాతే విద్యా వ్యవస్థ లోపాలపై చర్చ: ఖర్గే

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా తర్వాతానే తాము పార్లమెంట్ లో విద్యావ్యవస్థలోని లోపాలపై చర్చకు ఒప్పుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుధవారం లోక్‌సభకు మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. చర్చకు సంబంధించిన నిబంధనలు, తేదీ, సమయాన్ని నిర్ణయించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ ఓం బిర్లాను ఆయన కోరారు. అయితే చర్చకు ముందుగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కాంగ్రెస్ పట్టుబట్టడం గమనార్హం. మరోవైపు ఇదే అంశంపై విపక్షాల పట్టు విడవకుండా నిరసనలకు దిగడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

Latest News