Dhankhar Resignation | ఈడీ దర్యాప్తు పేరిట ఒత్తిడి.. అందుకే ధన్‌ఖడ్‌ రాజీనామా : సంజయ్‌ రౌత్‌

ధన్‌ఖడ్‌, ఆయన భార్య జైపూర్‌లోని తమ నివాసాన్ని విక్రయించారని, దాని ద్వారా వచ్చిన కొంత మొత్తాన్ని విదేశాలకు తరలించారని వదంతులు వ్యాపించాయి. వారి కార్యకలాపాలను ఈడీ నిశితంగా ట్రాక్‌ చేసింది. ఉపరాష్ట్రపతిపై అభియోగాలు మోపుతూ ఒక ఫైల్‌ను ఈడీ సిద్ధం చేసిందని కూడా వార్తలు వచ్చాయి.

  • By: TAAZ |    national |    Published on : Mar 24, 2026 6:04 PM IST
Dhankhar Resignation | ఈడీ దర్యాప్తు పేరిట ఒత్తిడి.. అందుకే ధన్‌ఖడ్‌ రాజీనామా : సంజయ్‌ రౌత్‌

Dhankhar Resignation | స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అక్కసుతోనే ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ను ఎన్డీయే ప్రభుత్వం బలవంతంగా ఆ పదవికి రాజీనామా చేయించిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ పేర్కొన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయిస్తామని బెదిరించడం వల్లే ఆయన రాజీనామా చేశారని తన తాజా పుస్తకంలో తెలిపారు. 2025 జూలైలో అనూహ్య పరిణామాల మధ్య రాజీనామా చేసిన జగ్దీప్‌ ధన్‌ఖడ్‌.. అరోగ్య కారణాలే ఈ నిర్ణయానికి కారణమని అప్పట్లో చెప్పారు. కానీ.. అసలు కారణాలు వేరే ఉన్నాయని అప్పట్లోనే చర్చలు సాగాయి. ప్రభుత్వానికి నచ్చని నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆయనను తప్పించారని వార్తలు వచ్చాయి.

తాజాగా పుస్తకం ‘అన్‌లైక్‌లీ ప్యారడైజ్‌’లో ధన్‌ఖడ్‌ గురించి ప్రస్తావించిన రౌత్‌.. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ధన్‌ఖడ్‌ ఆస్తిపాస్తులు, లావాదేవీలు, విదేశీ ఖాతాలకు తరలించిన నిధుల విషయంలో ఫైల్‌ను ఈడీ సిద్ధం చేసిందని రాశారు. వాస్తవానికి ఈ పుస్తకం ఇంగ్లిష్‌ వెర్షన్‌ను గత ఏడాది విడుదల చేశారు. తాజాగా దానికి నాలుగు చాప్టర్లు జోడించి, తిరిగి విడుదల చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చర్యలను ప్రస్తావించిన రౌత్‌.. అది బీజేపీ ‘శాఖ’గా ఎలా తయారైందో.. ఎన్నికల కమిషన్‌ వంటి ప్రజాతంత్ర సంస్థలను ఎలా గుప్పిట పట్టిందో విమర్శనాత్మకంగా వివరించారు. ఈ పుస్తకాన్ని సోమవారం ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ తదితరులు ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో ధన్‌ఖడ్‌ గురించి రాస్తూ… ‘ధన్‌ఖడ్‌, ఆయన భార్య జైపూర్‌లోని తమ నివాసాన్ని విక్రయించారని, దాని ద్వారా వచ్చిన కొంత మొత్తాన్ని విదేశాలకు తరలించారని వదంతులు వ్యాపించాయి. వారి కార్యకలాపాలను ఈడీ నిశితంగా ట్రాక్‌ చేసింది. ఉపరాష్ట్రపతిపై అభియోగాలు మోపుతూ ఒక ఫైల్‌ను ఈడీ సిద్ధం చేసిందని కూడా వార్తలు వచ్చాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధన్‌ఖడ్‌ రాజకీయంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదనలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈడీ.. ఆయనకు ఈ ఫైల్‌ను అందించిందని, రాజీనామా చేయాలని ఒత్తిడి చేసిందని వదంతులు వచ్చాయి. తొలుత ఆయన కేంద్ర ఆదేశాలను పాటించేందుకు నిరాకరించడంతో ఒత్తిడి మరింత పెరిగింది. దానితో ఆయన అసౌకర్యానికి గురయ్యారు’ అని పేర్కొన్నారు. జడ్జీల నియామకం, వారి పనితీరు మొదలుకుని.. ఆఖరుకు రాష్ట్రపతి వ్యవహారాలను సైతం పర్యవేక్షించే స్థాయికి ఈడీ వెళ్లిందని రౌత్‌ ఆరోపించారు.

ఈ పుస్తకంపై బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి నవనాథ్‌ బన్‌ స్పందిస్తూ.. ఏదో పుస్తకంలో ఎవరో రాసినంత మాత్రాన అది నిజమైపోదని అన్నారు. ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయాలంటే గట్టి ఆధారాలు, అధికారి డాక్యుమెంట్లు లేదా స్పష్టమైన ప్రకటనలు అవసరమని చెప్పారు.

తన రాజీనామా అనంతరం ధన్‌ఖడ్‌ ఆ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇటీవల మాత్రం.. తాను ఆరోగ్య కారణాలపై రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు. ‘ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాననే నేను చెప్పాను. అది అందరూ చేయాల్సిందే’ అని ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని చురు జిల్లా సదుల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.