పర్యావరణ విధ్వంసం చేసే జన్యుమార్పిడి విత్తనాలను వ్యతిరేకిస్తున్న దక్షిణ భారత రైతులు
రైతులకు ఉన్న విత్తన స్వాతంత్ర్యాన్ని హరించి, ఆర్థిక నష్టాలకు గురి చేసి, రైతులపైన భారం వేస్తూ, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యు మార్పిడి పంటలను అనుమతించబోమని దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

రైతులకు ఉన్న విత్తన స్వాతంత్ర్యాన్ని హరించి, ఆర్థిక నష్టాలకు గురి చేసి, రైతులపైన భారం వేస్తూ, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యు మార్పిడి పంటలను అనుమతించబోమని దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాలు రైతు సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దక్షిణ భారత దేశానికి చెందిన తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో సహజత్వానికి భిన్నంగా జరిగే జన్యు మార్పిడి విధానాన్ని వ్యతిరేకిస్తూ హాజరైన ప్రతినిధులందరూ మాట్లాడారు.
జన్యు మార్పిడి విత్తనాల వలన రైతుకు ఉన్న విత్తన స్వాతంత్రం కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందని పునరుద్ఘాటించారు. జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యం తో పాటు పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా రైతులతో పాటు వినియోగదారుల ను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి కేంద్రం స్వస్తి పలికేలా ముందుకు సాగుతామని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కన్నెగంటిరవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పిఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు కెవి బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.