20% Ethanol Blended Petrol | మీకు టూవీలర్‌ ఉందా.. సోమవారం సుప్రీంకోర్టు విచారించే అంశం మీకు సంబంధించినదే!

20% ఎథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol Blended Petrol - E20) నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. వాహన ఇంజిన్లకు (Vehicle Engines) నష్టం, మైలేజ్ (Mileage) తగ్గడం, మరమ్మతుల ఖర్చులు (Repair Costs) పెరగడం వంటి సమస్యలపై వాహనదారులు (Motorists) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • By: TAAZ |    national |    Published on : Aug 31, 2025 4:32 PM IST
20% Ethanol Blended Petrol | మీకు టూవీలర్‌ ఉందా.. సోమవారం సుప్రీంకోర్టు విచారించే అంశం మీకు సంబంధించినదే!

20% Ethanol Blended Petrol | మీ బైక్‌ లేదా కారు 2013కు ముందు తయారైందా? మీకు బీఎస్‌—6 మోడల్‌ వాహనాలు ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే. దేశవ్యాప్తంగా ఈబీపీ—20 పెట్రోల్‌ (ఇథనాల్‌ 20% కలిపినది)ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిష్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుటకు ఈ మేరకు ఒక ప్రజా ప్రయోజనాల పిటిషన్‌ రానున్నది. దేశంలో ఉన్న కోట్ల వాహనాలు ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వాడేందుకు తయారుచేసినవి కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇథనాల్‌ మిక్స్‌డ్‌ ఇంధనం వాడటం వల్ల వీటి ఇంజిన్‌లు పాడైపోతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది అక్షయ్‌ మెహతా సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

పిటిషన్‌లో ఏముంది?

  • దేశంలోని ప్రతి పెట్రోల్‌ బంకులో ఇథనాల్‌ రహిత పెట్రోల్‌ అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖకు ఆదేశాలు ఇవ్వాలి.
  • ప్రతి పెట్రోల్‌ బంకులో ఇథనాల్‌ శాతం తప్పనిసరిగా, స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలి.
  • వినియోగదారులు తమ వాహనాల్లో పెట్రోల్‌ పోయించుకునేందుకు వచ్చినప్పుడు వారి వాహనాలు ఇథనాల్‌ కలిపిన ఇంధనం నింపగలిగినవేనా? కాదా? అన్న సమాచారం వారికి అందించాలి.

ఎందుకు ఆందోళన?

దేశంలో లక్షల మంది వాహనదారులు బలవంతంగా ఇథనాల్‌ కలిపిన ఇంధనం పోయించుకోవాల్సి వస్తుంది.
2023 సంవత్సరానికి ముందు తయారు చేసిన కార్లు, ద్విచక్రవాహనాలు, కొన్ని కొత్త బీఎస్‌ –6 మోడళ్లు కూడా 20 శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనానికి అనుకూలమైనవి కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇటువంటి ఇంధనాన్ని ఉపయోగిస్తే సదరు వాహనాల మైలేజీ పడిపోవడమే కాకుండా.. ఇంజిన్లు దెబ్బతినే అవకాశం ఉందని, ఫలితంగా ఖర్చు పెరిగిపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటువంటి కారణాలతో బైకులకు మరమ్మతులు వస్తే బీమా కంపెనీలు వాహనాలకు బీమాలను తిరస్కరిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నది?

అమెరికా, పలు యూరప్‌ దేశాల్లో ఇథనాల్‌ రహిత పెట్రోల్‌ విరివిగా లభిస్తున్నదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్‌ శాతంపై బంకుల వద్ద స్పష్టంగా ప్రదర్శిస్తుంటారు. దానిని తెలుసుకున్న తర్వాతే వాహనదారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ అమ్ముతున్నప్పటికీ.. అందులో ఎంత శాతం మిక్స్‌ చేశారనే వివరాలు ఏ బంకులోనూ ప్రదర్శించడం లేదు. 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వాడటం వల్ల ఇంధన సామర్థ్యం రెండు శాతం నుంచి 5 శాతం వరకూ తగ్గిపోతుందని ఆటోమొబైల్‌ నిపుణులు చెబుతున్నారు.