బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్

300 కొత్త బస్సులను ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా టికెట్ కొనుగోలు చేసి ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాపై తనదైన ముద్ర వేశారు.

తమిళనాడు సీఎం, టీవీకే అధినేత క్రమంగా పరిపాలనలో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 300 డీజిల్, సీఎన్జీ(CNG) బస్సులను చెన్నై సచివాలయంలో సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థల ఆధునీకరణ, ప్రజా రవాణా బలోపేతంలో భాగంగా ఈ వాహనాలను చేర్చారు. సుదూర సర్వీసుల (SETC) మినహా, మిగిలిన ఏడు ప్రభుత్వ రవాణా విభాగాలకు వీటిని కేటాయించారు. అనంతరం విజయ్ స్వయంగా టికెట్ కొని.. అన్నా స్క్వేర్ నుండి పెరంబూర్ వెళ్లే 29A నంబర్ గల ప్రభుత్వ బస్సు ఎక్కి ప్రయాణించారు.

విజయ్ కొత్త పథకాలు..

సీఎం విజయ్ అధికారంలోకి వచ్చాక పలు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో మహిళలు, బాలికల భద్రతకు ‘సింగప్పెన్‌ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ షీటీమ్స్, డ్రగ్స్ నివారణకు యాంటీ-నార్కోటిక్ టాస్క్ ఫోర్స్’ తీసుకొచ్చారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో పాటు తాజాగా తన జన్మదినం జూన్ 22 సందర్బంగా తమిళనాడులో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి పసిబిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా అందించే పథకాన్ని ప్రారంభించారు.

‘తాయ్‌మామన్ తంగ మోతీర తిట్టం’ (మేనమామ బంగారు ఉంగర పథకం) పేరుతో ప్రవేశపెట్టిన ఈ విశిష్ట పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సంస్కృతిలో పుట్టిన పిల్లాడికి మేనమామ బంగారు ఉంగరం తొడగడం ఒక పవిత్రమైన సంప్రదాయంగా భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ.. ఆ బిడ్డకు మేనమామ స్థానంలో ప్రభుత్వమే నిలబడి ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనుంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ ఒక గ్రాము బంగారు ఉంగరం ధర రూ. 13,600 గా ఉంది. ఈ భారీ సంక్షేమ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ. 755.83 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచడం, తల్లి బిడ్డల క్షేమం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

Latest News