కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు.. విజయ్ ఆఫర్? వీసీకే, కమ్యూనిస్టులకు కూడా..
తమిళనాడులో సుదీర్ఘ విరామం తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లౌకిక పార్టీల మద్దతు కోరుకుంటున్న విజయ్.. తన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టులకు ప్రభుత్వంలో స్థానం కల్పిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో రాజకీయాలు కొంత పుంతలు తొక్కనున్నాయి. కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో లేని సంకీర్ణ రాజకీయాలు మళ్లీ ఉనికిలోకి రానున్నాయి. టీవీకే సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే మెజార్టీ మార్కుకు దూరంగా నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర పక్షాలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. 2006లో మెజార్టీ దక్కించుకోలేక పోయిన డీఎంకే ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ.. సంకీర్ణ ప్రభుత్వంలో చేరుతుందనే చర్చలు టీవీకే వర్గాల్లో వినిపిస్తున్నాయి.
పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిని విజయ్.. మంగళవారం పార్టీ ఆఫీసులో కలుసుకున్నారు. టీవీకే ఎల్పీ సమావేశంలో విజయ్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం విజయ్.. గవర్నర్ రాజేంద్ర అర్లెకర్‌ను స్వయంగా కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ లేఖ అందించారు. రెండు వారాల సమయంలో సభ విశ్వాసం పొందుతామని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టు పార్టీలతో విజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. అందుకే రెండు వారాల గడువు సరిపోతుందని ఆయన విశ్వాసంతో ఉన్నట్టు చెబుతున్నారు.
డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి (ఎస్‌పీఏ)లో సింగిల్ డిజిట్ సీట్లు సాధించిన పార్టీలతో సంప్రదింపులను విజయ్, టీవీకే నాయకులు ప్రారంభించారు. 11 సీట్లు మాత్రమే అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి లౌకిక పార్టీల నుంచి అవసరమైన మద్దతు అందుతుందన్న విశ్వాసంతో టీవీకే నేతలు ఉన్నారు. తిరుమావళన్ నేతృత్వంలోని వీసీకే, ఇతర కొన్ని చిన్న పార్టీలు సింగిల్ డిజిట్ స్థానాలు సాధించాయి. బీజేపీ భాగస్వామిగా లేని లౌకిక కూటమిలో భాగస్వామి అయ్యేందుకు తానుసిద్ధంగా ఉన్నానని తిరుమావళన్ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ 5, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2 సీట్లు గెలిచాయి. పీఎంకే కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతున్నది.
తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పక్షాలకు నాలుగు నుంచి ఆరు క్యాబినెట్ బెర్తులను విజయ్ ఆఫర్ చేసినట్టు ప్రచారంలో ఉన్నది. కాంగ్రెస్ రెండు మంత్రిపదవులు కోరుతున్నది. వీసీకే, సీపీఐ, సీపీఎంలకు తలొక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తున్నది.
టీవీకే తరఫున ఎన్నికైన 107 మంది ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి కేఏ సెంగొట్టియన్, సత్యబామ, బీఎస్ బాబు, జేసీడీ ప్రభాకరన్ మినహాయిస్తే మిగిలినవారంతా తొలిసారి చట్టసభలకు ఎన్నికైనవారే కావడం విశేషం. అన్నాడీఎంకేలో కీలక బాధ్యతల్లో వ్యవహరించి, టీవీకేలోకి వచ్చిన సీనియర్ నేతలకు కీలకమైన పదవులు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతున్నది. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్ ఆనంద్, శాంటియోగా మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున్, సీటీఆర్ నిర్మల్ కుమార్, ఐఆర్‌ఎస్ మాజీ అధికారి కేజీ అరుణ్‌రాజ్, రాజ్‌మోహన్ వంటివారికి క్యాబినెట్‌లో చోటు లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. రాజకీయ బేరసారాల ప్రమాదం లేకుండా తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురం సమీపంలోని రిసార్టుకు విజయ్ తరలించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram