Telangana Assembly | నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టే దిశగా సర్కార్ ఆలోచనలు
ఈనెలాఖరు వరకు సమావేశాలు
నేడు మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
రుణమాఫీ అమలుతో నిధుల లేమి..? 2.50 లక్షల కోట్లకు బడ్జెట్ కుదింపు
విధాత, హైదరాబాద్ : నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సంతాప తీర్మానాల అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి పనిదినాలు డిక్లేర్ చేయనున్నారు. ఈనెలాఖరు వరకు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 28, 29 తేదీల్లో బోనాల పండుగ ఉన్నందున మొత్తం వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ జరిగేలా చూస్తున్నారు. ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కేంద్రం మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తుందో అంచనా వేసుకుని ఆ మేరకు అసెంబ్లీలో పలు కీలక నిర్ణయాలు, బిల్లులకు సంబంధించిన వాటిపై సర్కార్ క్లారిటీకి రానుంది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు పెద్దగా కేటాయించే చాన్స్ లేదు. దీనికి తోడు ఇటీవలే సర్కార్ చాలెంజింగ్ తీసుకుని రుణమాఫీ చేసింది. దీంతో నిధుల కటకట కొనసాగుతోంది. నాలుగు వేల రూపాయల పెన్షన్‌ను అమలు చేసే అంశం తదితర హామీ పథకాలపై నిధుల కేటాయింపు ఉండకపోవచ్చు. కాంగ్రెస్ సర్కార్ ఓటన్ ఎక్కౌంట్ బడ్జెట్ కింద 2.70 లక్షల కోట్లను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడంతో దీన్ని కుదించనున్నారు. 2.50 లక్షల కోట్లకు పరిమితం చేయనున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ అత్యధికంగా 2, 95, 000 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
కేసీఆర్ రాకపై ఉత్కంఠ…
ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తారా.. లేదా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. అయితే మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలపై సభ్యులు అనుసరించాల్సిన వ్యహాలపై చర్చించనున్నారు. అంశాల వారీగా ఇప్పటికే ఎవరేమీ మాట్లాడాలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో నేతలెవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. మా వ్యూహం మాకుంటుందని మాత్రం నర్మగర్భంగా హరీశ్ వ్యాఖ్యానించడం పట్ల కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చని తెలుస్తోంది.